TANA: ర్యాలీలో తానా ఫుడ్ డ్రైవ్ విజయవంతం
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (TANA) ర్యాలీ చాప్టర్, ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ కరోలినా యూత్ వింగ్ యువ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్ ను విజయవంతంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ ఫుడ్ డ్రైవ్ కి మంచి స్పందన లభించింది. దాదాపు 2 వేల మంది నిరాశ్రయులకు మరియు అన్నార్తులకు సరిపడా ఫుడ్ సమకూర్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా, దాతలుగా ముందుకు రావడం మరియు ప్యాకింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా సాయం చేయడం అభినందనీయం. థాంక్స్ గివింగ్ డే రోజున దుర్హం రెస్కూ మిషన్ సెంటర్ ఫర్ హోప్ అనే సంస్థలో ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫుడ్ డ్రాప్ ఆఫ్ లొకేషన్స్ ఏర్పాటుచేసి కార్న్, గ్రీన్ బీన్స్, హవాయియన్ రోల్స్, పలు ఆహారపదార్ధలతో కూడిన బాక్సులను, డొనేషన్స్ సమీకరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు, పెద్దలు సైతం ఇష్టంగా పాల్గొని సహాయం చేయడం ఒక మంచి పరిణామం.
ఈ సందర్భంగా తానా అపలాచియన్ రీజినల్ కోఆర్డినేటర్ రాజేష్ యార్లగడ్డ మాట్లాడుతూ ఈ ఫుడ్ డ్రైవ్ ఇనీషియేటివ్ కి సంపూర్ణంగా సహకరించి విజయవంతానికి తోడ్పడిన దాతలకు, వాలంటీర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిన ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ కరోలినా యూత్ వింగ్ యువ డైరెక్టర్ రామ నూనె, అలాగే ధనుంజయ్ ఈడ, వినోద్ కాట్రగుంట, సాయిరాం కాట్రగడ్డ, శ్రీకాంత్ ఉప్పలపాటి, వెంకట్ కోగంటి, వంశి బొట్టు, రమేష్ తుమ్మలపల్లి తదితరులను అభినందించారు.







