Sankranthi Celebrations:న్యూజెర్సీలో ఘనంగా తెలుగు కళా సమితి సంక్రాంతి సంబరాలు
- తెలుగు భాషా పోటీలతో చిన్నారుల్లో చైతన్యం.. జనవరి 24న వేడుకలు
న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో తెలుగు సంస్కృతిని, భాషను ప్రతిబింబించేలా తెలుగు కళా సమితి (TFAS) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 24వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సోమర్సెట్లోని శ్రీ స్వామినారాయణ్ మందిర్ వాడతాల్ధామ్ (VDNJ) వేదికగా ఈ వేడుకలు జరగనున్నాయి.
తెలుగు భాష ఉన్నతి కోసం, పిల్లలకు మన భాషపై మక్కువ పెంచేందుకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ‘తెలుగు భాషా పోటీలు’ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తెలుగు క్విజ్, తెలుగు స్పీకింగ్, పద్య పఠనం వంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే వారు జనవరి 20వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఒక్కో పోటీకి రిజిస్ట్రేషన్ ఫీజు 10 డాలర్లుగా నిర్ణయించారు.
ఈ వేడుకలకు విచ్చేసే అతిథులందరికీ ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చి అమెరికాలో స్థిరపడిన తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి చేర్చి, మన పండుగ గొప్పతనాన్ని చాటిచెప్పడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని టీఎఫ్ఏఎస్ (TFAS) బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఉషా దరిశిపూడిని (732-718-4184) సంప్రదించవచ్చు.






