Balashouri: వాషింగ్టన్లో బాలశౌరికి ఆత్మీయ సన్మానం
అమెరికా రాజధాని వాషింగ్టన్ (Washington DC) లో జనసేన, తెలుగుదేశం, భాజపా అభిమానుల సమక్షంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి (Balashouri)కి ఆత్మీయ సన్మానం, అభినందన సభ నిర్వహించారు. స్థానిక జనసేన నాయకులు విజయ్ గుడిసేవ, వేణు పులిగుజ్జు, శౌర్య ప్రసాద్ కొచ్చెర్ల.. తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సతీష్ వేమన ఈ కార్యక్రమంలో అతిధులుగా పాల్గొన్నారు. పలువురు వక్తలు బాలశౌరి రాజకీయ ప్రస్థానాన్ని, నిబద్ధతనూ, ప్రజా శ్రేయస్సుకు ఆయన చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలనూ గుర్తుచేస్తూ కొనియాడారు.
ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.. అధికశాతం మంది భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చిన వారేనన్నారు. కష్టపడి చదువుకొని అవకాశాలను అందిపుచ్చుకుని ఈనాడు ప్రపంచవేదికపై తెలుగువారు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారన్నారు. రాజకీయ అంతిమ లక్ష్యం ప్రజా సేవే అని, ప్రవాసులు ఇక్కడి నుంచి సైతం రాష్ట్రం గురించి ఆలోచించి పలు రంగాల్లో చేయూతనందిస్తున్నారని అభినందించారు. పవన్ కల్యాణ్ గ్రామీణాభివృద్ధిపై దృష్టి సారించి పేద, మధ్యతరగతి వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సంయుక్త కార్యాచరణతో ముందుకు సాగుతున్నారన్నారు.
ప్రవాసులు ఎప్పుడూ రాష్ట్ర ప్రగతిలో భాగమేనని మనందరి ముందున్న లక్ష్యం పోలవరం, రాజధాని అమరావతి అని పేర్కొన్నారు. జనసేన నాయకులు విజయ్ గుడిసేవ, శౌర్య ప్రసాద్ కొచ్చెర్ల, వేణు పులిగుజ్జు మాట్లాడారు. జనసేన పార్టీ, కూటమి విజయానికి పనిచేసిన కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీరామ్, బాలా, విజయ్ కొచ్చెర్ల, సుధీర్ కొమ్మి, భాను మాగులూరి, సుధాకర్, కృష్ణ, రవి అడుసుమిల్లి, అవినాష్, సిద్దు, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.







