వైట్‍హౌస్‍కు తాకిన నిరసనలు

అమెరికాలో నల్లజాతీయుల ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. నల్లజాతి యువకుడు జార్జ్ ఫ్లాయిడ్ గత సోమవారం తెల్లజాతి పోలీసుల చేతిలో దారుణ హత్యకు గురైన తర్వాత మొదలైన నిరసనలు ఆదివారం దేశ అధ్యక్ష భవనం వైట్‍హౌస్‍కు తాకాయి. ఆందోళనకారులు దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలోని వైట్‍హౌస్ గేటు వద్ద డస్ట్బిన్‍కు నిప్పు పెట్టారు. నిరసనలకు కేంద్రమైన మిన్నెపొలిస్‍లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు నగరంలో పదివేల మంది నేషనల్ గార్డస్ను రంగంలోకి దించారు. ఫిలడేల్ఫియాలో ఆదివారం నాలుగు పోలీస్ వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ సందర్భంగా చెలరేగిన హింసలో 13 మంది పోలీసులు గాయపడ్డారు. న్యూయార్క్, అట్లాంటా, డెనోవర్, లాస్‍ఎంజిల్స్, మిన్నెపొలిస్, ఆన్‍ప్రాన్సిస్కో, సియాటెల్ వంటి నగరాల్లో రాత్రి 8 గంటల తర్వాత కర్ఫ్యూ విధించారు. 22 నగరాల్లో గురువారం నుంచి ఇప్పటివరకు 1669 మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఒకవైపు దేశమంతా భగ్గుమంటున్నా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఫ్లోరిడాలో స్పేస్‍ఎక్స్ రాకెట్ ప్రయోగాన్ని తలకించటంలోనే గడిపారు.