Dr. MS Reddy: డాక్టర్ ఎంఎస్ రెడ్డికి అరుదైన మరో పేటెంట్…..
నెల్లూరు జిల్లాకు చెందిన డాక్టర్ మలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి (MS Reddy) అమెరికాలో తన పరిశోధనల ద్వారా ఎన్నోరకాల పేటేంట్లను సంపాదించిన సంగతి తెలిసిందే. చీజ్ కింగ్ గా పేరు పొందిన ఆయన తాజాగా చేసిన పరిశోధనకు గాను ఆయనకు పేటేంట్ వచ్చింది. అల్లోపతి, ఆయుర్వేదం, ఇతర మెడిసిన్స్‌ను ప్రొబయోటిక్స్‌తో కలపడం ద్వారా వైద్య విధానాల సక్సెస్ రేటును పెంచవచ్చని ఆయన తన పరిశోధనల ద్వారా నిరూపించారు. ఆయన పరిశోధనను గుర్తించిన యూఎస్ ప్రభుత్వం దీనికి సంబంధించిన పేటెంట్‌ను డాక్టర్ ఎంఎస్ రెడ్డికి అందజేసింది. ఆయన చేసిన పరిశోధన ప్రకారం కొన్ని మెడిసిన్స్‌ను తయారు చేశారు. వీటిని అల్జీమర్స్, ఒబేసిటీ, అర్థిరైటిస్, హెమరాయిడ్స్, జీర్ణక్రియ సమస్యలు వంటి ఇతర వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్లకు ఇచ్చారు. ఈ సరికొత్త మెడిసిన్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేసినట్లు పరిశోధకులు తెలిపారు. అల్లోపతీ మందులు సాధారణంగా కొద్దో గొప్పో సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటాయనే సంగతి తెలిసిందే. కానీ డాక్టర్ ఎంఎస్ రెడ్డి పరిశోధనతో ఈ సైడ్ ఎఫెక్ట్స్ దాదాపుగా తొలగించగలిగారు. ఈ క్రమంలోనే ఆయన పరిశోధనకు నెంబర్ #6080401 యూఎస్ పేటెంట్‌ను అందజేశారు.
ఈ పరిశోధనతో కేన్సర్ వంటి నయం చెయ్యలేని వ్యాధుల చికిత్స విధానాలు కొత్తపుంతలు తొక్కుతాయని పరిశోధకులు చెప్తున్నారు. కేన్సర్ చికిత్స సమయంలో పేషెంట్లలో ప్రొబయాటిక్స్ సహా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఫ్లోరా అంతా నాశనం అవుతుంది. ఈ విషయం తెలిసినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ భయంతో ఈ చికిత్సలో ప్రొబయాటిక్స్ ఉపయోగించడానికి వైద్యులు ఇష్టపడరు. ఇక్కడే డాక్టర్ ఎంఎస్ రెడ్డి అద్భుతమైన ఆలోచన చేశారు. జీవించి ఉన్న ప్రొబయాటిక్స్ స్థానంలో చనిపోయిన ప్రొబయాటిక్స్ (పారాప్రొబయాటిక్స్)ను వాటి ఇమ్యూనోమాడ్యులేటరనీ బైప్రొడక్ట్స్‌ను ఉపయోగించవచ్చనే విప్లవాత్మక ఆలోచనతో డాక్టర్ ఎంఎస్ రెడ్డి ముందుకొచ్చారు. ఈ విధానంతో డిస్బయాసిస్ (కడుపులో ఉండే మైక్రోబయల్ సంఖ్యలో వచ్చే అసమానతలు)ను తొలగించవచ్చు. తద్వారా కేన్సర్, ఇతర చికిత్సల్లో ఉపయోగించే మెడిసిన్స్ ప్రభావం పెరుగుతుంది.
తెలుగు వారైన డాక్టర్ ఎంఎస్ రెడ్డి.. నెల్లూరు జిల్లా కోవూర్ తాలూకా ఉప్పలపాడులో జన్మించారు. తిరుపతిలోని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ డిగ్రీ పొందారు. యూఎస్‌లోని ఐయోవా స్టేట్ యూనిర్సిటీ నుంచి ఫుడ్ టెక్నాలజీ, బ్యాక్టీరియాలజీ, వైరాలజీల్లో ఎంఎస్, పీహెచ్‌డీ పూర్తిచేశారు. ప్రస్తుతం యూఎస్‌లోని అమెరికన్ డైరీ అండ్ ఫుడ్ కన్సల్టింగ్ ల్యాబొరేటరీ చైర్మన్‌గా, ఇంటర్నేషనల్ మీడియా అండ్ కల్చర్స్ సంస్థల్లో ప్రెసిడెంట్‌గా ఉన్నారు.







