అంతర్జాలంలో ఘనంగా అన్నమయ్య జయంతి

పదకవితా పితామహుడు, తొలి తెలుగు వాగ్గేయ కారుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 613 వ జయంత్యుత్సవాలను హైదరాబాద్ హైటెక్ సిటీ లోని “అన్నమాచార్య భావనా వాహిని“ శోభాయమానంగా నిర్వహించింది. కరోనా మూలంగా ఈ ఉత్సవాన్ని హై టెక్ సిటీ లోని అన్నమయ్యపురంలో నిర్వహించడానికి, ప్రతి సంవత్సరం లాగా ‘మహా నగర సంకీర్తన ‘నిర్వహించడానికి అవకాశం లేకున్నా సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అంతర్జాలంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ‘అన్నమాచార్య భావనా వాహిని’ వ్యవస్థాపకురాలు, అన్నమయ్య పద కోకిల పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారి ఆధ్వర్యంలో ‘ప్రార్థనా సంకీర్తనం’ పేరిట జరిగిన ఈ భక్తి సంగీత కార్యక్రమంలో ‘ అన్నమాచార్య భావనా వాహిని’ విద్యార్థినీ విద్యార్థులందరూ పాల్గొని చక్కటి కీర్తనలను ఆలపించి, ఈ కార్యక్రమానికి వన్నె తెచ్చారు.
శ్రీమతి శోభారాజు గారు ఆలపించిన ‘శ్రీ నందకాయ‘ స్తుతి తో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు ‘హరియవతారమీతడు, అప్పని వరప్రసాది, నమామ్యహం, తగునయ్యా, ఆకాశమడ్డమా, ఇట్టి ముద్దులాడి, చాలదా, అదివో చూడరో, తిరుమల గిరిరాయ మొదలగు పలు అద్భుతమైన కీర్తనలను ఆలపించి స్వామికి స్వర నివేదనం గావించారు. కొన్ని కీర్తనల యొక్క భావం తెలియజేసిన శోభారాజు గారి వ్యాఖ్యానం కార్యక్రమానికి మరింత వన్నె చేకూర్చింది. కరోనా కష్ట కాలంలో ప్రపంచాన్ని ఈ ఆపద నుండి కాపాడమంటూ శోభారాజు గారు రచించి, స్వరపరిచి, విశ్వ వ్యాప్తం చేసిన ‘ గోవిందా రక్షమాం కరోనాతః ‘ అన్న కీర్తనతో కార్యక్రమం ముగిసింది. ప్రపంచ క్షేమం కోసం పాటుబడుతున్నశోభారాజు గారు దాని భావార్థాన్ని వివరించి అందరినీ ఆలోచింపచేసారు. హారతి తో కార్యక్రమం ముగిసింది.