Review: కుటుంభ కథా చిత్రం ‘వీడే మన వారసుడు’

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : ఆర్ ఎస్ ఆర్ట్స్,
తారాగణం: రమేష్ ఉప్పు, లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్. సమ్మెట గాంధీ, దేవసేన ,
విజయ రంగరాజు, ఆనంద్ భారతి, గూడూరు కిషోర్, శిల్ప, సిద్ధు రాయల్, అద్వితేజ్ రెడ్డి తదితరులు నటించారు.
సంగీతం: సదివే దేవేంద్ర, నేపథ్య సంగీతం : శ్రీ వెంకట్
మాటలు, పాటలు : రమేష్ ఉప్పు, సినిమాటోగ్రఫీ : డి. యాదగిరి
ఎడిటింగ్: కె. శ్రీనివాస్ రావు,
కో-డైరెక్టర్: అమీర్ కజ్ రాణి
ఫైట్స్: యాక్షన్ అహ్మద్, షావోలిన్ మల్లేష్
కొరియోగ్రఫీ: బాలకృష్ణ (బాలు)
సమర్పణ : యు రామాదేవి
నిర్మాత, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : రమేష్ ఉప్పు
విడుదల తేది : 18.07.2025
సమాజానికి అవసరమైన సందేశాన్ని అందిస్తూ హృదయాన్ని తాకే కుటుంబ కథా చిత్రం ‘వీడే మన వారసుడు’.(Veede Mana Vaarasudu) రమేష్ ఉప్పు (Ramesh Uppu) హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు రచయితగా, రైతుల కష్టాలను, కుటుంభంలోని భావోద్వేగాలను ప్రదాన అంశంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల పలువురు సినీ ప్రముఖులు రమేష్ ఉప్పును దర్శకరత్న దాసరితో పోల్చడంతో ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. తాజాగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి రోజున (జూలై 18 న ) థియేటర్లలో విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూ లో తెలుసుకుందాం.
కథ :
నగరంలోని ఓ అపార్టుమెంట్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తున్న రామన్న (రమేష్ ఉప్పు) తన మంచితనంతో అందరి మనసులూ గెలుచుకుంటాడు. అనుకోని పరిణామంగా అపార్ట్‌మెంట్‌లోని కొంతమంది యువకులు డ్రగ్స్ వాడకంతో మృతిచెందుతారు. పరిస్థితిని గమనించిన రౌడీ గ్యాంగ్, చనిపోయిన వారిపై అప్పులున్నాయంటూ శవాలను తీసుకెళ్లకుండా అడ్డుకుంటుంది. అప్పుడే వాచ్‌మన్ రామన్న వారిని మట్టికరిపిస్తాడు. ఇక్కడే ఒక భారీ ట్విస్ట్ – రామన్న గమ్యం కావడమే కాదు, గంభీరమైన గతం ఉన్న వ్యక్తి అని అందరికీ అర్థమవుతుంది. కథ ఇక్కడ నుంచి పల్లె దిశగా మలుపు తిరుగుతుంది. గ్రామంలో కొండన్న (రమేష్ ఉప్పు) అనే రైతు మంచి మనిషిగా, అందరికీ ఆదర్శంగా పేరు సంపాదిస్తాడు. మేనకోడలిని (లావణ్యరెడ్డి) పెళ్లి చేసుకోవడం వల్ల వారి పిల్లలు పుట్టగానే మరణిస్తుండటం ఓ శాపంలా మారుతుంది. దాంతో ఆ పేద రైతు కుటుంబంలో అప్పులు కూడా పెరిగిపోతాయి. ఇవన్నీ తట్టుకోలేక కొండన్న తండ్రి అంకన్న (సమ్మెట గాంధీ) మనోవేదనలో భార్య( దేవసేన )తో కలసి ఆత్మహత్య చేసుకుంటాడు. కుటుంబ బాధలు, తిరిగి పుట్టే పిల్లలకు అవకాశాలు లేకపోవడం.. ఈ గుండెను పిండి వేసే వాస్తవాల నడుమ కొండన్న ఊరిని వదిలి వెళ్తాడు. అంతా వదిలేసిన కొండన్న.. నగరానికి వచ్చి రామన్నగా ఎలా మారాడు? తన జీవిత బాధల్ని ఎలా నిలబెట్టుకున్నాడు? చివరకు తన కథకి సుఖాంతం వచ్చిందినా? అన్నదే మిగతా కథ.
నటీనటుల హవబవాలు :
రమేష్ ఉప్పు హీరోగా తన నటనతో ఆకట్టుకుని చిత్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. ఆయన భావోద్వేగ సన్నివేశాల్లో, యాక్షన్ సీక్వెన్స్‌లలో చూపించిన సహజత్వం, శక్తివంతమైన నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఏక్షన్ సీన్లలో అదరగొట్టారు. బహుముఖ ప్రతిభాశీలిగా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం, నిర్మాణంలో తన సమర్థతను చాటుకున్నారు. ఇక హీరోయిన్ లావణ్య రెడ్డి ఆమె నటన కథకు తగ్గట్టుగా సహజంగా, ఆకట్టుకునేలా ఉంది. ఆమె పాత్రలోని లోతైన భావోద్వేగాలను అద్భుతంగా పండించింది. సర్వాణి మోహన్ కూడా తన పాత్రలో ఆకర్షణీయమైన నటనతో మెప్పించింది. హీరో తండ్రి అంకన్న పాత్రలో నటించిన సమ్మెట గాంధీ తన అనుభావాన్ని తెరపై అద్బుతంగా ఆవిష్కరించారు, దేవసేన తన పాత్రతో సినిమాకు నిండు తనాన్ని తీసుకువచ్చారు, విజయ రంగరాజు, ఆనంద్ భారతి, గూడూరు కిషోర్, శిల్ప, సిద్ధు రాయల్, అద్వితేజ్ రెడ్డి వంటి కీలక పాత్రల్లో చిత్రంలోని తమ వంతు ప్రాముఖ్యత చాటుకున్నారు.
సాంకేతిక వర్గం పనితీరు :
గ్రామీణ ప్రాంతాల సౌందర్యాన్ని, సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించిన డి. యాదగిరి కెమెరా పనితనం సినిమాకు ప్రాణం పోసింది. ప్రతి ఫ్రేమ్‌లో గ్రామీణ నేపథ్యం ఆకట్టుకునేలా ఉంది. కథను ఒక దశ నుండి మరొక దశకు మార్చడంలో ఎడిటింగ్ కీలక పాత్ర పోషించింది. సదివే దేవేంద్ర అందించిన సంగీతం పరవ లేదు. పాటలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. శ్రీ వెంకట్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాల లోతును, ఉద్వేగాన్ని మరింత పెంచింది. యాక్షన్, డ్రామా సన్నివేశాల్లో బీజీఎం సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. సినిమాకు హైలైట్ పాయింట్‌గా చెప్పుకునే యాక్షన్ సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా, ఆకర్షణీయంగా ఉన్నాయి. యాక్షన్ అహ్మద్, షావోలిన్ మల్లేష్ కొరియోగ్రఫీ సినిమాకు ఒక విశిష్టమైన శైలిని తెచ్చింది. బాలకృష్ణ అందించిన నృత్య రీతులు సినిమాకు శక్తిని, ఆకర్షణను జోడించాయి. నిర్మాణపు విలువలు చిత్రానికి తగినట్టుగా ఉన్నాయి.
విశ్లేషణ:
రైతుల సమస్యలను కేంద్రంగా చేసుకుని, సమాజానికి సందేశాత్మక కథను, గ్రామీణ నేపథ్యంలో భావోద్వేగాలను, గ్రామీణ సౌందర్యాన్ని, శక్తివంతమైన నటనను అందించే చిత్రం. సమాజానికి స్పష్టమైన మెసెజ్ అందించింది. రమేష్ ఉప్పు రచన, దర్శకత్వంలో ఈ సినిమా సమాజంలోని కీలక సమస్యలను చర్చిస్తూ, ప్రేక్షకులకు ఆలోచనాత్మక సందేశాన్ని అందిస్తుంది. డ్రగ్స్‌తో యువత చిత్తవుతున్న తీరు, మేనరికం పెళ్లిళ్లతో పిల్లలను కోల్పోతున్న పరిస్థితులు, ఆధునిక కాలంలోనూ రైతుల ప్రాధాన్యత.. వంటి కీలక అంశాలను ఎంతో బలంగా చూపించిందీ సినిమా. ఎక్కడా బోర్ కొట్టకుండా సాఫీగా సాగే ఓ మంచి ప్రయత్నంగా రూపొందిన సందేశాత్మక చిత్రం ‘వీడే మన వారసుడు’.