Suman TV: ఉద్యోగులకు సుమన్ టీవీ అరుదైన కానుక, పదో వార్షికోత్సవంలో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు

డిజిటల్ రంగంలో అగ్రగామిగా ఉన్న సుమన్ టీవీ(Suman Tv) వినూత్న కార్యక్రమం చేపట్టింది. సంస్థ పదో వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులకు సొంతంగా 2 బెడ్ రూమ్ ఫ్లాట్లు అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలోనే అగ్రగామి డిజిటల్ టీవీగా నిలిచిన సుమన్ టీవీ పదో వార్షికోత్సవం అత్యంత ఘనంగా జరుపుకుంది. కేవలం ఓ వ్యక్తి ఆలోచన, శ్రమతో ప్రారంభమై..వటుడింతై అన్నట్టు వేయిమందికి పైగా ఉద్యోగులతో పదో వార్షికోత్సవాన్ని అత్యంత ఘనంగా జరుపుకుంది. రానున్న కాలంలో సుమన్ టీవీ అన్ని భాషల్లో ప్రసారం కానుందని చైర్మన్ సుమన్(Suman) ప్రకటించారు.
దేశంలోని డిజిటల్ ఛానెళ్లలో సుమన్ టీవీ ప్రస్థానం 2015లో ప్రారంభమైంది. సంస్థ ఎదుగుదలలో ఉద్యోగుల పాత్ర కీలకమని భావించిన సుమన్ టీవీ ఛైర్మన్ సుమన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు టూ బెడ్ రూం ప్లాట్లు ఉచితంగా అందించారు. తొలి దశలో 20 మంది ఉద్యోగులకు ప్లాట్లు అందించింది.
టూ బెడ్ రూమ్ ప్లాట్లు అందించేందుకు సుమన్ టీవీ మాతృ సంస్థ ప్లే ఈవెన్ ఇన్ఫో లిమిటెడ్(Play even info limited) ఓ విధానం రూపొందించుకుంది. సంస్థలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 75 వేల కంటే తక్కువ జీతం కలిగిన ఉద్యోగులకు ప్లాట్లు అందించాలని నిర్ణయించింది. పదో వార్షికోత్సవంలో ఉద్యోగుల సంక్షేమం, ప్రయోజనం కోసం ఇలాంటి వినూత్న నిర్ణయం తీసుకోవడం బహుశా దేశంలోనే ఇది తొలిసారి కావచ్చు. న్యూస్ ఛానెల్ లేదా డిజిటల్ న్యూస్ రంగంలో అయితే ఇదే తొలిసారి. కేవలం ఇద్దరితో ప్రారంభమై వేయి మంది ఉద్యోగులు కలిగిన సంస్థగా ఎదగడంతో ఉద్యోగుల కృషి ఎప్పటికీ మర్చిపోలేనిదని..అందుకే ఇలా రుణం తీర్చుకుంటున్నామని ఛైర్మన్ సుమన్ చెప్పడం గమనార్హం. ఎలాంటి పెట్టుబడి లేకుండా సంస్థను స్థాపించి కోట్ల రూపాయల సంస్థగా ఎదగడంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని సుమన్ తెలిపారు. రానున్న కాలంలో అన్ని భాషల్లో సుమన్ టీవీ ప్రసారాలు ప్రారంభం కావడమే కాకుండా గ్లోబలైజ్ చేసే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు.
ఎలక్ట్రానిక్ డిజిటల్ రంగంలో దేశంలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా అశేష సంఖ్యలో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని కలిగిన సుమన్ టీవీ రానున్న కాలంలో మరో కొత్త ప్రయత్నం చేయనుంది. త్వరలో దేశంలోని అన్ని ముఖ్యమైన భాషల్లో సుమన్ టీవీని విస్తరించడం ద్వారా దేశవ్యాప్తం కానుంది.
పదో వార్షికోత్సవంలో అడుగుపెడుతున్న సుమన్ టీవీ యాజమాన్యం, సిబ్బందితో పాటు ప్లే ఈవెన్ ఇన్ఫో లిమిటెడ్ మాతృసంస్థకు మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi), జేడీ లక్ష్మీ నారాయణ(JD Lakshmi Narayana) తదితరులు అభినందనలు తెలిపారు. ఇంకా ఇతర వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు సుమన్ టీవీ సిబ్బందికి, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.