Chiranjeevi: కోట శ్రీనివాసరావు మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం తెలియజేసిన మెగాస్టార్ చిరంజీవి

భారతీయ సినిమాకు ఎనలేని కృషి చేసిన దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. కోట గారితో వృత్తిపరమైన, వ్యక్తిగత సుధీర్గ అనుబంధాన్ని కలిగిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), కోట శ్రీనివాసరావు మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
”విలక్షణమైన నటనకి పరిపూర్ణమైన రూపం కోట శ్రీనివాసరావు గారు. మహానటుడు, లెజెండ్రీ క్యారెక్టర్ యాక్టర్. మా ఇద్దరి నట ప్రస్థానం ప్రాణం ఖరీదు సినిమాతో ప్రారంభమైంది. సుదీర్ఘమైన నట ప్రస్థానంలో మా అనుబంధం ఎంతగానో పెనవేసుకుంది. తెరమీద ఆయన నటన అద్భుతం. వ్యక్తిగతంగా ఆయన హాస్య చమత్కారం కూడా అద్భుతం. ఆయన షూటింగ్లో ఉంటే చాలా ఉత్సాహంగా గడిచేది.
ఆయన చేయలేని క్యారెక్టర్ లేదు. ఆయనకి అన్ని మాండలికాలు వచ్చు. నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న గొప్ప నటుడు. ఆయనతో నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ప్రత్యేకం.
కోటా శ్రీనివాసరావు గారు ఈరోజు లేరనేది వారి కుటుంబానికే కాదు పరిశ్రమకు తీరని లోటు. అలాంటి వైవిధ్యమైన పాత్రలు పోషించే నటుడు మళ్లీ వస్తారని నేను అనుకోవటం లేదు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను”
చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్ X ద్వారా కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
“లెజెండరీ యాక్టర్ , బహుముఖ ప్రజ్ఞా శాలి శ్రీ కోట శ్రీనివాస రావు గారు ఇక లేరు అనే వార్త ఎంతో కలచివేసింది.
‘ప్రాణం ఖరీదు’ చిత్రం తో ఆయన నేను ఒకే సారి సినిమా కెరీర్ ప్రారంభించాము. ఆ తరువాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రని తన విలక్షణ, ప్రత్యేక శైలి తో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు శ్రీ కోట .
కామెడీ విలన్, అయినా సీరియస్ విలన్ అయినా, సపోర్టింగ్ క్యారక్టర్ అయినా, ఆయన పోషించిన ప్రతి పాత్ర ఆయన మాత్రమే చేయగలడు అన్నంత గొప్పగా నటించారు. రీసెంట్ గా ఆయన కుటుంబం లో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మానసికంగా ఎంతగానో కుంగదీసింది.
శ్రీ కోట శ్రీనివాస రావు లాంటి నటుడు లేని లోటు చిత్ర పరిశ్రమ కి, సినీ ప్రేమికులకి ఎన్నటికీ తీరనిది.ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకి, అభిమానులకి , నా ప్రగాఢ సంతాపం తెలియ చేస్తున్నాను.