బన్నీ ఆర్మీ వర్సెస్ మెగా ఫ్యాన్స్ వివాదం ఆగేనా…?

పుష్పరాజ్ తగ్గేదే లే అంటున్నాడు. తను హీరో అయింది ఫ్యాన్స్ ను చూసే అని తెగేసి చెబుతున్నాడు. నచ్చితే ఎక్కడికైనా వస్తా, ఎంతవరకైనా వస్తా అని గట్టిగా చెబుతున్నాడు. దీంతో ఇప్పుడీ వివాదం టాక్ ఆఫ్ ద పాలిటిక్స్ అయింది.దీన్ని చల్లార్చేందుకు అటు మెగా కుటుంబం కానీ.. ఇటు అల్లు కుటుంబం కానీ ఎక్కడా ప్రయత్నించిన దాఖలాలు కనిపించడం లేదు. దీనికి తోడు తన అల్లుడు చేసింది తప్పు కాదని.. బన్ని మామ పబ్లిగ్గా ప్రకటన ఇచ్చి ..వివాదాన్ని మరింత రక్తి కట్టించారు. పవన్ తరపున జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వకాల్తా పుచ్చుకుని నేరుగా బన్నిపై ప్రకటన చేయడం మరింత అగ్గి రగిలిందని చెప్పొచ్చు.
అసలు ఉన్నట్లుండి ఇప్పుడు బన్నీ-మెగా బంధం ఎందుకు వివాదానికి గురయింది. నిజానికి మెగా శిబిరంలో పవన్ ఫ్యాన్స్ తీరే వేరు. ఎవరి సినిమా ఫంక్షన్ అయినా పవర్ స్టార్ గురించి మాట్లాడాలని వారు ఆశిస్తారు. ఇది నిజానికి చిరంజీవి, నాగబాబు సహా మెగా హీరోలకు ఓ సందర్భంలో చికాకు తెప్పించింది. అయితే వారందరూ.. ఆ సమయంలో చిన్నగా వార్న్ చేసి వదిలేశారు. కానీ.. బన్నీ మాత్రం.. చెప్పను బ్రదర్ అంటూ .. అప్పట్లోనే సెటైర్ వేశాడు. దీంతో ఇది కాస్త బన్నీ వర్సెస్ పవర్ స్టార్ ఫ్యాన్స్ గా మారిపోయింది.
తర్వాత ఎవరికి వారు కామ్ గా ఉన్న సమయంలో… ఇటీవల కర్నాటక సీఎంతో సమావేశం తర్వాత పవన్.. యధాలాపంగా సినిమా హీరోలు స్మగ్లర్లలా ఉన్నట్లు సినిమాల్లో నటిస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో హీరోలు స్మగ్లింగ్ అడ్డుకునేట్లుగా సమాజ హితానికి ప్రయత్నిస్తే.. ఇప్పుడు అలా లేదన్నారు. అయితే ఇది పుష్పరాజ్ గురించే అని టాక్ నడిచింది. ఇలాంటి తరుణంలో ఓసినిమా ఫంక్షన్ లో చెర్రీ మరోసారి తన స్టాండ్ ఏమిటో స్పష్టం చేశాడు. తన ఆర్మీ తనకుందంటూ .. సెటైర్ వేశాడు. దీంతో మెగా ప్యాన్స్ వర్సెస్ బన్నీ ఆర్మీగా సోషల్ మీడియా వార్ నడుస్తోంది.
చిరంజీవి లేకుంటే బన్నీ ఎక్కడుండేవాడని.. మెగా ఫ్యాన్స్ సెటైర్లు వేస్తే.. అల్లు రామలింగయ్య మద్దతుగా ఉండకుంటే.. పవన్ ఎక్కడ ఉండేవాడని బన్నీ ఆర్మీ సమాధానమిస్తోంది. ఇప్పుడిది కాస్తా మరింతగా విస్తరిస్తోంది. అయితే ఇంత జరుగుతున్నా చిరంజీవి ,పవన్ కల్యాణ్ , నాగబాబు .. ఈవివాదాన్ని తుంచేందుకు ప్రయత్నించకపోవడం .. చర్చకు దారితీస్తోంది.