డైలాగ్.. యాక్షన్… పంచ్‌లతో తెలుగు తెరపై చెరగని ముద్ర

స్వర్ణోత్సవ వేళలో తెలుగుటైమ్స్ ప్రత్యేక కథనం
‘ఒరేయ్ వీర రాఘవరెడ్డి…నేను దొంగలా రాలేదు దొరలా వచ్చాను, నీ ఊరొచ్చా..నీ ఇంటికొచ్చా..నట్టింటి కొచ్చా…..
నా పేరులోనే సింహముందిరా దాన్ని రక్తపు జల్లుతో నిద్రలేపారు..ఈ మీసంలో పగ తీర్చుకునే పౌరుషం ఉంది. ఈ మీసంలో ఎదిరించిన వాడిని మట్టి కరిపించే రాజసం ఉంది……’’
‘‘ఇలా చెయ్యి కలిపే నీ బావ గొయ్యిలో పడుకున్నాడు…
పోనీ నీ ఊరి నడిబొడ్డులో చూసుకుందామా..ప్లేస్ నువ్వు చెప్పినా సరే..నన్ను చెప్పమన్నా సరే..ప్లేస్ నువ్వు చెప్పినా సరే..నన్ను చెప్పమన్నా సరే.. టైమ్ నువ్వు చెప్పినా సరే..నన్ను చెప్పమన్నా సరే..ఎప్పుడైనా సరే.. ఎక్కడైనా సరే..
కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా…’’
‘‘చూడు.. ఒక వైపే చూడు.. రెండో వైపు చూడాలనుకోకు.. తట్టుకోలేవ్… మాడిపోతావ్..’’
‘‘లేడన్న ధైర్యమా… రాడన్న నమ్మకమా.. ఒకడు మంచి కోరి మావైపు అడుగేస్తే.. పదడుగులు ముందుకేస్తాం.. అదే చెడుకోరి అడుగేస్తే వంద అడుగులు ఎదురొస్తాం.’’
బుల్లెట్స్ వంటి ఈ డైలాగ్స్ వినగానే ఏ తెలుగు ప్రేక్షకడికైనా వెంటనే గుర్తుకు వచ్చే పేరు నటసింహ నందమూరి బాలకృష్ణ…ఈ డైలాగ్స్ మచ్చుకు మాత్రమే. ఇటువంటి ఎన్నో పవర్ఫుల్ డైలాగ్స్‌తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన చరిత్ర నటసింహ నందమూరి బాలకృష్ణకే సొంతం.
ఈ తరం తన తరం హీరోలతో పోటీగా నటనలో వాడి, డైలాగ్స్‌తో వేడి తన పవర్తో నేటికీ ప్రేక్షకుడిని థియేటర్వైపు అడుగులు వేయిస్తూ… ఆకర్షిస్తున్న హీరో నందమూరి బాలకృష్ణ. 14 సంవత్సరాలకే తండ్రి నందమూరి తారకరామారావు స్వీయ దర్శకత్వంలో 1974 ఆగష్టు 29న విడుదలైన తాతమ్మ కల సినిమాతో తెలుగు సినిమా రంగానికి పరిచయమైన నటసింహం నందమూరి బాలకృష్ణ అనతి కాలంతో అగ్రహీరోగా ఎదిగారు. తండ్రికి తగ్గ తనయుడిగా అయిదు దశాబ్దాలుగా నందమూరి నటవారసుల్లో తన ప్రత్యేకతను చాటుకున్న హీరో బాలకృష్ణ.
ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో మలుపులు, మైలురాళ్లు. సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ సాధించిన విజయాలకు కొదవేలేదు. తెలుగునాట అగ్ర కథానాయకుడిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తనలోని నటనాసక్తిని కనబరిచి మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు. సినిమా కెరీర్ పారంభంలోనే అన్నదమ్ముల అనుబంధం, అనురాగదేవత, రౌడీ రాముడు` కొంటెకృష్ణుడు వంటి సాంఘిక, దానవీర శూరకర్ణ పౌరాణిక, వేముల వాడ భీమకవి, అక్బర్ సలీం అనార్కలి చారిత్రక సినిమాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడిగా తన అసమాన ప్రతిభను చాటుకున్నారు. 1984లో సాహసమే నా ఊపిరి సినిమాతో బాలకృష్ణ కథానాయకుడిగా మారారు. మంగమ్మగారి మనవడు చిత్రం సూపర్హిట్ కొట్టి మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకుని క్రేజ్ పెంచుకున్నారు. ముద్దుల క్రిష్ణయ్య, ముద్దుల మావయ్య, నారి నారి నడుమ మురారి, అనసూయమ్మగారి అల్లుడు, మువ్వగోపాలుడు వంటి సినిమాలు భారీ విజయాలు సాధించడమే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్సుకు బాలకృష్ణను దగ్గర చేశాయి.
తెలుగు సినీ చరిత్రలో ఎక్స్పెరిమెంటల్ మూవీ ఆదిత్య 369 చిత్రం ఆనాడే ఫ్యూచర్స్ సైన్స్ ఫిక్సన్ ఇప్పటి తెలుగు చలనచిత్ర చరిత్రలో అరుదైన చిత్రంగా నిలిచిపోవడమే కాదు. బాలకృష్ణలోని ప్రయోగాత్మక చిత్రాల దోరణికి అద్దం పట్టింది. ఈ చిత్రంలో బాలకృష్ణ వేసిన శ్రీ కృష్ణ దేవరాయుల గెటప్తో ఇటు అభిమానులు, ప్రేక్షకుల గుండెల్లో శ్రీకృష్ణదేవరాయులు ఇలానే ఉండేవారా..! అనేంతలా గుర్తుండిపోయింది. తండ్రి ఎన్టీఆర్ నుండి పుణికి పుచ్చుకున్న నటనా కౌశలంతో కృష్ణార్జున విజయంలో కృష్ణుడు, అర్జునుడు, శ్రీరామరాజ్యంలో శ్రీరాముడి, పాండురంగడులో పాండురంగడు పాత్రలకు పౌరాణిక పాత్రలకు ప్రాణం పోశారు. ఇప్పటి తరం హీరోల్లో పౌరాణిక, జానపదం, సోషియో ఫాంటసీ, చారిత్రక, భక్తిరస, సాంఘిక చిత్రాలు… ఇలా అన్ని రకాల సినిమాల్లో నటించిన ఏకైక హీరో బాలకృష్ణే. ఇలాంటి పాత్రలను బాలకృష్ణ ఒక్కడు మాత్రమే చేయగలడనడంలో అతిశయోక్తి లేదు. నటుడిగా మూసదోరణి సినిమాలు చేయడానికి బాలకృష్ణ ఇష్టపడరు. జానపదచిత్రం భైరవద్వీపం బాలకృష్ణ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రంలో రాజకుమారిని వరించే విజయుడిగా, శాపానికి గురైన కురూపిగా ఆయన నటన అద్భుతం! ఈ చిత్రంలో డి గ్లామర్ రోల్ చేసి ఔరా అనిపించారు.
వంశానికొక్కడు, పెద్దన్నయ్య వంటి ఫ్యామిలీ ఎంటర్ట్కెనర్స్తో తనయుడిగా, బాధ్యత గల అన్నయ్యగా అలరించారు. అది ఆయన సినిమాలు చూసే ప్రేక్షకుడికి అర్థమవుతుంది. సీమ పౌరుషాన్ని పరిచయం చేసిన సమరసింహారెడ్డి చిత్రం బాలయ్య నటనలోని మరో యాంగిల్ను పరిచయం చేసింది. సమరసింహారెడ్డి సినిమాతో భారీ హిట్ కొట్టి తెలుగునాట ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్కి నాంది పలికారు. ఆ చిత్రంలో ఆయన చెప్పిన డైలాగ్స్‌తో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడమే కాదు అత్యధిక సెంటర్స్లో రజతోత్సవం జరుపుకున్న చిత్రంగా రికార్డ్ సాధించింది. మరోమారు సీమ పౌరుషాన్ని నరసింహనాయుడు చిత్రంతో రుచి చూపించి బాక్సాఫీస్ బొనాంజాగా అవతరించారు. అంతే కాకుండా ఈ చిత్రంతో ఉత్తమ నటుడిగా తొలి అవార్డుని సొంతం చేసుకున్నారు. నరసింహనాయుడు సినిమాతో మరోసారి భారీ హిట్ కొట్టి బాక్పాఫీస్ బొనాంజాగా నిలిచారు.
లక్ష్మీనరసింహాతో పోలీస్ పవర్ను చూపి కలెక్షన్స్ కొల్లగొట్టిన బాలయ్య సింహా సినిమాతో బాక్సాఫీస్ వద్ద సింహనాదం చేసి తన డైలాగ్స్‌తో వాడి, వేడి ఏ మాత్రం తగ్గలేదని సినీ విమర్శకులకు చెప్పకనే చెప్పారు. తండ్రి ఎన్టీఆర్ అడుగుజాడల్లో సినీ ఓనమాలు దిద్దిన బాలయ్య అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్బాబు వంటి సీనియర్ నటులుతో నటించి అభిమానులను, ప్రేక్షకులను అలరించారు. సినీ రంగంలోనే కాకుండా…రాజకీయ రంగంలో కూడా తండ్రికీ తగ్గ వారసుడిగా, హిందూపురం నియోజకవర్గం నుండి నందమూరి తారకరామారావు 1985,1989,1994 లలో హ్యాట్రిక్ విజయం సాధిస్తే… 2014,2019,2024 ప్రత్యక్ష్య రాజకీయాల్లో పాల్గొని అదే హిందూపురం నియోజకవర్గం నుండి హ్యాట్రిక్ కొట్టి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. కథ, డైరెక్టర్లకు ప్రాధాన్యతనిచ్చే బాలకృష్ణ ప్రస్తుతం ప్రయోగాలకు వెనకాడని తత్వం, పట్టుదలతో ముందుకు సాగే సాహసం ఈ నందమూరి అందగాణ్ణి నటసింహంలా మార్చాయి. ఆగష్టు 29న సినీ స్వర్ణోత్సవం జరుపుకుంటున్న ఈ నందమూరి అందగాడు వజ్రోత్సవం కూడా జరుపుకోవాలని కోరుకుంటూ నందమూరి బాలకృష్ణకి తెలుగు టైమ్స్ స్వర్ణోత్సవ శుభాకాంక్షలను అందజేస్తుంది.
నటుడిగా అయిదు దశాబ్దాలను పూర్తి చేసుకున్న బాలకృష్ణ ప్రెస్టిజియస్ 109వ సినిమా త్వరలోనే విడుదలకు రంగం సిద్ధమవుతుంది. బాబీ దర్శకత్వంలో శ్రీ కర్ స్టూడియోస్ ప్రెసెంట్, సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చున్ ఫోర్ సినిమాస్, సంయుక్తంగా సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘‘సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్’’ అనే డైలాగ్ తో విడుదలైన గ్లిమ్ప్స్ 5 మిలియన్స్ వ్యూస్ అధిగమించింది. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గ్యారెంటీ అని అర్థమవుతుంది అప్రతిహతంగా కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రం నుండి నిన్నటి భగవంత్ కేసరి వరకు 108 చిత్రాలు పూర్తిచేయడం అందులో 90 శాతం వరకు చిత్రాలు విజయవంతం కావడం విశేషం. ఈ సందర్భాన్ని పునస్కరించుకున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను సెప్టెంబర్ 1న ఘనంగా నిర్వహించేందుకు సినీ అతిరధ మహారథులు ఏకమయ్యారు. ఈ మహా వేడుక ప్రపంచానికి తెలిసేలా చేయాలని యావత్ తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది.
యువరత్న బాలకృష్ణ నటించిన చిత్రాల జాబితా
1. తాతమ్మ కల, 2. రామ్-రహీమ్, 3. అన్నదమ్ముల అనుబంధం, 4. వేములవాడ భీమకవి, 5. దానవీరశూరకర్ణ, 6. అక్బర్-సలీం-అనార్కలి, 7. శ్రీమద్విరాట్ పర్వం, 8. శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, 9. రౌడీ రాముడు కొంటె కృష్ణుడు, 10. అనురాగదేవత, 11. సింహం నవ్వింది, 12. సాహసమే జీవితం, 13. డిస్కోకింగ్, 14. జననీ-జన్మభూమి, 15. మంగమ్మగారి మనవడు, 16. పల్నాటిపులి, 17. శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, 18. కథానాయకుడు, 19. ఆత్మబలం, 20. బాబాయ్ అబ్బాయ్, 21. భార్యాభర్తల బంధం, 22. భలే తమ్ముడు, 23. కత్తుల కొండయ్య, 24. పట్టాభిషేకం, 25. నిప్పులాంటి మనిషి, 26. ముద్దుల కృష్ణయ్య, 27. సీతారామకళ్యాణం, 28. అనసూయమ్మగారి అల్లుడు, 29. దేశోద్ధారకుడు, 30. కలియుగ కృష్ణుడు, 31. అపూర్వ సహోదరులు, 32. భార్గవరాముడు, 33. అల్లరికృష్ణయ్య, 34. సాహస సామ్రాట్, 35. ప్రెసిడెంట్గారి అబ్బాయి, 36. మువ్వగోపాలుడు, 37. రాము, 38. భానుమతిగారి మొగుడు, 39. ఇన్స్పెక్టర్ ప్రతాప్, 40. దొంగరాముడు, 41. తిరగబడ్డ తెలుగుబిడ్డ, 42. భారతంలో బాలచంద్రుడు, 43. రాముడు-భీముడు, 44. రక్తాభిషేకం, 45. భలేదొంగ, 46. ముద్దులమావయ్య, 47. అశోక చక్రవర్తి, 48. బాలగోపాలుడు, 49. ప్రాణానికి ప్రాణం, 50. నారీనారీనడుమమురారి, 51. ముద్దుల మేనల్లుడు, 52. లారీడ్క్రెవర్, 53. తలిదండ్రులు, 54. బ్రహ్మర్షివిశ్వామిత్ర, 55. ఆదిత్య 369, 56. ధర్మక్షేత్రం, 57. రౌడీ ఇన్స్పెక్టర్, 58. అశ్వమేధం, 59. నిప్పురవ్వ, 60. బంగారుబుల్లోడు, 61. భ్కెరవద్వీపం, 62. గాండీవం, 63. బొబ్బిలిసింహం, 64. టాప్హీరో, 65. మాతో పెట్టుకోకు, 66. వంశానికొక్కడు, 67. శ్రీకృష్ణార్జున విజయం, 68. పెద్దన్నయ్య, 69. ముద్దుల మొగుడు, 70. దేవుడు, 71. యువరత్న రాణా, 72. పవిత్రప్రేమ, 73. సమరసింహారెడ్డి, 74. సుల్తాన్, 75. కృష్ణబాబు, 76. వంశోద్ధారకుడు, 77. గొప్పింటి అల్లుడు, 78. నరసింహనాయుడు, 79. భలేవాడివిబాసూ, 80. సీమసింహం, 81.చెన్నకేశవరెడ్డి, 82. పలనాటి బ్రహ్మనాయుడు, 83. లక్ష్మీనరసింహా, 84. విజయేంద్రవర్మ, 85. అల్లరి పిడుగు, 86. వీరభద్ర, 87. మహారథి, 88. ఒక్క మగాడు, 89. పాండురంగడు, 90. మిత్రుడు, 91. సింహా, 92. పరమవీరచక్ర, 93. శ్రీరామరాజ్యం, 94. అధినాయకుడు, 95. ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా, 96. శ్రీమన్నారాయణ, 97. లెజెండ్, 98. లయన్, 99.డిక్టేటర్, 100.గౌతమీపుత్ర శాతకర్ణి. 101. పైసా వసూల్ 102. జై సింహ, 103. యన్టీర్ కథానాయకుడు, 104. యన్టీర్ మహా నాయకుడు, 105. రూలర్, 106. అఖండ, 107. వీర సింహారెడ్డి, 108. భగవంత్ కేసరి, 109.శ్రీ కర్ స్టూడియోస్ ప్రెసెంట్, సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చున్ ఫోర్ సినిమాస్, దర్శకుడు బాబీ కొల్లి.
– లంకా రాంబాబు వర్మ