Akhanda 2: అఖండ 2కు బ్రేక్ వేసిన ‘దూకుడు’..! అసలేం జరిగింది?
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల (Boyapati Srinu) క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం అఖండ 2 (Akhanda 2) విడుదలకు చివరి నిమిషంలో ఊహించని బ్రేక్ పడింది. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ (డిసెంబర్ 5) సినిమా థియేటర్లలో సందడి చేయాల్సి ఉంది. అయితే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన స్టే కారణంగా షోలన్నీ రద్దయ్యాయి. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు, భారీ అంచనాలతో ఉన్న బయ్యర్లకు ఈ పరిణామం దిగ్భ్రాంతిని కలిగించింది. అయితే, ఈ హఠాత్పరిణామం వెనుక ఉన్నది సాంకేతిక లోపమో, సెన్సార్ సమస్యలో కావు.. పూర్తిగా నిర్మాతల పాత బాకీల వ్యవహారమే ఈ సినిమా పాలిట శాపంగా మారింది.
ఈ వివాదానికి మూలాలు 2011 నాటి దూకుడు సినిమాతో ముడిపడి ఉన్నాయి. మహేష్ బాబు హీరోగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర ఆ చిత్రాన్ని నిర్మించారు. ఆ ప్రాజెక్ట్ కోసం ముంబైకి చెందిన ప్రముఖ కార్పొరేట్ సంస్థ ‘EROS ఇంటర్నేషనల్’ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది. ఆ సినిమా లావాదేవీలకు సంబంధించి నిర్మాతలు తమకు సుమారు రూ. 11 కోట్లు బకాయి పడ్డారని EROS సంస్థ అప్పట్లో కోర్టును ఆశ్రయించింది.
దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం, 2019 జులైలోనే EROS సంస్థకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అసలు రూ.11 కోట్లతో పాటు, వడ్డీతో కలిపి మొత్తం రూ. 27.70 కోట్లను 2025 డిసెంబర్ నాటికి చెల్లించాలని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలను ఆదేశించింది. అయితే, ఆ గడువు సమీపిస్తున్నా నిర్మాతల నుండి స్పందన లేకపోవడంతో EROS సంస్థ అప్రమత్తమైంది.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దూకుడు సినిమాను నిర్మించింది “14 రీల్స్ ఎంటర్టైన్మెంట్” కాగా, ప్రస్తుత అఖండ 2 చిత్రాన్ని నిర్మించింది “14 రీల్స్ ప్లస్”. పాత సంస్థలో అనిల్ సుంకర భాగస్వామిగా ఉండగా, కొత్త బ్యానర్ లో కేవలం రామ్ ఆచంట, గోపి ఆచంట మాత్రమే నిర్మాతలుగా ఉన్నారు. ఈ సాంకేతిక అంశాన్ని అడ్డం పెట్టుకుని నిర్మాతలు కోర్టులో వాదన వినిపించారు. అనిల్ సుంకర ఈ ప్రాజెక్ట్ లో లేనందున, పాత బకాయిలకు ఈ సినిమాకు సంబంధం లేదని వాదించారు.
కానీ, EROS ఇంటర్నేషనల్ వాదన మరోలా ఉంది. కేవలం పాత బకాయిలను ఎగ్గొట్టే ఉద్దేశంతోనే, అదే నిర్మాతలు పేరు మార్చుకుని కొత్త బ్యానర్ 14 రీల్స్ ప్లస్ కింద సినిమాలు తీస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చింది. ఇది ముమ్మాటికీ బకాయిల చెల్లింపును తప్పించుకునే వ్యూహమేనని వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన మద్రాస్ హైకోర్టు, పాత బకాయిలు చెల్లించేంత వరకు లేదా EROS సంస్థతో ఒప్పందం కుదుర్చుకునేంత వరకు అఖండ 2 విడుదలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
సినిమా విడుదల రోజున, తెల్లవారుజామున షోలు పడాల్సిన సమయంలో ఇలా కోర్టు ఆర్డర్స్ రావడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. ఇప్పటికే ఈ సినిమాను భారీ రేట్లకు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు, షోలు ప్లాన్ చేసుకున్న ఎగ్జిబిటర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులకు డబ్బులు వాపసు ఇవ్వడం థియేటర్ యాజమాన్యాలకు పెద్ద తలనొప్పిగా మారింది. బాలకృష్ణ సినిమా అంటేనే పండుగలా భావించే అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. నిర్మాతల నిర్లక్ష్యం వల్లే తమ హీరో సినిమా ఆగిపోయిందని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా విడుదల కావాలంటే నిర్మాతల ముందు రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి, కోర్టు ఆదేశించినట్లుగా EROS ఇంటర్నేషనల్ కు చెల్లించాల్సిన రూ. 27.70 కోట్లను తక్షణం చెల్లించాలి. లేదా, ఆ సంస్థతో చర్చలు జరిపి, కొంత మొత్తం చెల్లించి మిగిలిన మొత్తానికి హామీ ఇచ్చి “అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్” (Out of court settlement) చేసుకోవాలి.
ఇది కేవలం ఒక సినిమా సమస్య కాదు, కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకునేటప్పుడు, ఆర్థిక లావాదేవీల విషయంలో నిర్మాతలు ఎంత జాగ్రత్తగా ఉండాలనేదానికి ఇదొక హెచ్చరిక. ఏది ఏమైనా, నిర్మాతలు యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యను పరిష్కరించుకుని, వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అందరూ కోరుకుంటున్నారు. అప్పటి వరకు అఖండ 2 భవితవ్యం న్యాయస్థానం చేతుల్లోనే ఉంది.






