రూపాయి పతనంతో.. భారంగా మారుతున్న విదేశీ విద్య
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రోజురోజకూ దిగజారుతోంది. దీని వల్ల విదేశాల్లో చదువుకోవాలని అనుకునే భారతీయ విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. అమెరికాలో ఉన్నత విద్య చదవాలనే కోరిక ఉన్న వారికి ఇది ఆర్థిక భారంగా మారుతోంది. ఇలా పైచదువుల కోసం భారత్ నుంచి సుమారు లక్ష మంది విద్యార్థులు అమెరికా వెళ్తారు. వీరిలో తెలుగు వాళ్లు 35 వేల మంది వరకూ ఉంటారని అంచనా. ఇలా చదువుకోవడానికి అమెరికా వెళ్లే విద్యార్థులు.. కోర్సు ఫీజుతోపాటు వసతి, భోజనం వంటి ఖర్చులకు అవసరమైన డబ్బును కూడా ముందుగానే సమకూర్చుకుని వెళ్తుంటారు. ఇప్పుడు వీళ్లంతా కోర్సుల్లో చేరిన తర్వాత డాలర్ విలువ పెరగడంతో అంతకుముందు వేసుకున్న అంచనా ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో వాళ్ల లెక్కలు తప్పి విద్య భారంగా మారుతోంది.
ఉదాహరణకు అమెరికాలోని నేషనల్ యూనివర్సిటీల్లో పీజీ ఫీజు ఏడాదికి 40వేల డాలర్ల వరకు ఉంటుంది. అదే ప్రైవేటు కాలేజీలు అయితే ఇది ఇంకా ఎక్కువ. ఈ ఫీజులే కాకుండా వసతి, భోజనం, ఇతర ఖర్చుల కోసం నెలకు 1,000 నుంచి 1,200డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. వీటన్నింటి కోసం ఒక్కోవిద్యార్థికి ఏటా సుమారు 50వేల డాలర్ల అవసరం అవుతాయి. ఈ క్రమంలో గతేడాది ఆగస్టులో ఈ విద్యార్థులు కాలేజీల్లో అడ్మిషన్ తీసుకునే సమయంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.73 ఉంది. అంటే విద్యార్థులకు ఏటా సుమారు రూ.36లక్షలు అవసరం అవుతాయి. అయితే ఇప్పుడు డాలర్ విలువ రూ.80 దాటింది. ఈ లెక్కన విద్యార్థులకు ఏడాదికి రూ.40లక్షలు అవసరం ఉంటుంది. అంటే రెండేళ్ల పీజీ కోర్సు పూర్తయ్యేనాటికి రూ.8లక్షలు అదనంగా ఖర్చవుతుంది. దీనికితోడు ఇలా డాలర్ విలువ పెరగడంతో విమాన చార్జీలు కూడా పెరుగుతున్నాయి. ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నా కూడా కనీసం రూ.7-8వేలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. దీంతో విద్యార్థులు తిప్పలు పడుతున్నారు.






