Warren Buffett: అమెరికా స్టాక్‌మార్కెట్ పతనంపై… బఫెట్ ముందస్తు అంచనా!

ప్రపంచ స్టాక్ మార్కెట్లలో దిగ్గజ మదుపరి వారెన్ బఫెట్ (Warren Buffett) పంథా వేరు. ఆయన పెట్టుబడుల క్రమాన్ని అనుకరించి, కోటీశ్వరులైన వారి సంఖ్య కోకొల్లలు. అటువంటి వారెన్ బఫెట్ కొంతకాలం క్రితం యాపిల్ (Apple) కంపెనీ షేర్లను భారీగా విక్రయించి, నగదుగా అట్టే పెట్టుకున్నారు. ప్రస్తుతం బఫెట్ సంస్థల్లో నగదు నిల్వలు 325 బిలియన్ డాలర్లు ( దాదాపు రూ.28 లక్షల కోట్లు)గా ఉన్నాయి. ఈ స్థాయిలో నగదును ఉంచేయడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే గత 3 వారాల్లో అమెరికా స్టాక్ మార్కెట్ (Stock market) పతనమై 5 లక్షల కోట్ల డాలర్ల ( సుమారు రూ.435 లక్షల కోట్ల) సంపద ఆవిరైంది. ఇది చూశాక అమెరికా స్టాక్ మార్కెట్ ఒడుదొడుకుల పరిస్థితిని బఫెట్ ముందుగానే ఊహించారు. అందుకే స్టాక్స్ విక్రయించి, నగదు (Cash) అట్టేపెట్టుకున్నారు. తక్కువ విలువల్లో మెరుగైన స్టాక్స్ కొనేందుకు మళ్లీ సిద్ధమవుతారు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.