త్వరలో భారత్ లో ట్రైటాన్ ఎలక్ట్రిక్ ప్లాంట్
అమెరికాలోని న్యూజెర్సీ కేంద్రంగా పని చేస్తున్న ట్రైటాన్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎల్ఎల్సీ తమ అనుబంధ సంస్థను భారత్‌లో నమోదు చేయించింది. ఇక్కడి వ్యాపార కార్యకలాపాలు నమోదిత ట్రైటాన్ ఎలక్ట్రిక్ హెహికల్స్ ఇండియా ప్రై.వి. సంస్థ ద్వారా ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపింది. యూఎస్‌కు బయట ట్రైటాన్ ఈవీలకు అతి పెద్ద మార్కెట్‌ను భారత్‌లో నిర్మించేందుకు ఈ అనుబంధ సంస్థ కృషి చేస్తుందని ట్రైటాన్ వెల్లడించింది. దేశంలో తయారీ ప్లాంటును నెలకొల్పి, దేశీయ మార్కెట్‌తో పాటు బంగ్లాదేశ్, శ్రీలకం, నేపాల్, మధ్య ప్రాచ్య దేశాలు, ఆఫ్రికాకు ఇక్కడి నుంచే వాహనాల సరఫరా చేస్తామని కంపెనీ తెలిపింది. అయితే ఎంత మొత్తం పెట్టుబడి పెట్టబోతోంది? ప్లాంట్ ఏ ప్రాంతంలో రాబోతోంది? వంటి విషయాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
వచ్చే 3 ఏళ్లలో ఈ ప్లాంట్ ద్వారా 21,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ట్రైటాన్ ఈవీ వ్యవస్థాపకులు, సీఈఓ హిమాన్షు బి.పాటిల్ వెల్లడించారు. భారత్ మార్కెట్ మాకు ఎంతో ముఖ్యమైనది. ప్రభుత్వం కూడా విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. దేశీయ రహదారులతో పాటు ప్రపంచంలోని చాలా ప్రాంతాలకు ఈవీలు అనువుగా ఉంటాయని పాటిల్ పేర్కొన్నారు.






