Donald Trump: బంగారమంటే ఎవరికైనా మోజే.. ట్రంప్ కు మినహాయింపు లేదయ్యా..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump).. ఓ విషయంలో పక్కా క్లారిటీతో ఉన్నారు. తమ దేశం దిగుమతి చేసుకునే వివిధ వస్తువులపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్న ట్రంప్.. బంగారానికి (Gold) మాత్రం మినహాయింపు ఇస్తున్నారు. అమెరికా దిగుమతి చేసుకునే బంగారు కడ్డీలపై సుంకాల పెంపు వర్తిస్తుందా? లేదా? అనే విషయంపై సందిగ్ధతకు తెరదించారు ట్రంప్. బంగారం దిగుమతులపై సుంకాలు విధించబోమంటూ స్పష్టమైన ప్రకటన చేశారు.
అమెరికా కస్టమ్స్ విభాగం గతవారం విడుదల చేసిన ప్రకటనలో.. ఒక కేజీతోపాటు 100 ఔన్సుల (2.8 కిలోల) బంగారు కడ్డీలు సుంకాల పరిధిలోకి వస్తాయని పేర్కొంది. ఇదే సమయంలో బంగారంపై సుంకాల విధింపుపై ట్రంప్ క్లారిటీ ఇచ్చేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేస్తారంటూ ఓ వైట్‌హౌస్ అధికారి వ్యాఖ్యలు చేయడం మార్కెట్ వర్గాల్లో మరింత గందరగోళానికి కారణమైంది. ఈ నేపథ్యంలో పసిడి ధర కూడా రికార్డు స్థాయి గరిష్ఠానికి చేరుకుంది.
బంగారంపై సుంకాలు లేవంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టిన వెంటనే ధర ఔన్సుపై 50 డాలర్ల మేర తగ్గింది. మరోవైపు స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి చేసుకునే బంగారంపై 39 శాతం సుంకం విధించాలని అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల నిర్ణయించారు. అయితే, స్విస్ సహా అనేక దేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారు ఉత్పత్తులకు ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు ఉంటుందా? అనే విషయంపై స్పష్టత లేదని తెలుస్తోంది.







