భారత మార్కెట్ లోకి టెస్లా
అమెరికా ఎలక్ట్రిక్ కార్ దిగ్గజం టెస్లా వచ్చే ఏడాది భారత మార్కెట్ లోకి అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. 2021 లో కచ్చితంగా భారత మార్కెట్ లోకి ప్రవేశించాలని చూస్తున్నామని, అందుకనుగుణంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు టెస్లా సీఈవో ఎలాన్ మాస్క్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా ఇండియా వాంట్స్ టెస్లా సందేశంతో కూడిన టీ-షర్ట్ ఫొటోగ్రాఫ్‌ను పోస్ట్ చేశారు. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని, వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా దృష్టి సారించిన తరుణంలోనే తమ కంపెనీ భారత్‌కు రానున్నదని ఎలాన్ మాస్క్ ప్రకటించడం గమనార్హం. వాస్తవానికి టెస్లాను భారత్‌కు తీసుకొచ్చే విషయమై మస్క్ గతేడాదే స్పందించారు. ఈ ఏడాదే మేము భారత్‌లోకి ప్రవేశించాలని అభిలషిస్తున్నాం. ఇప్పుడు కుదరకపోతే వచ్చే ఏడాదైనా కచ్చితంగా భారత్‌కు వచ్చి తీరుతాం అని మస్క్ గతేడాది మార్చిలో చెప్పారు.






