టీసీఎస్ ఉద్యోగులకు శుభవార్త
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన ఉద్యోగులందరికీ వేతనాలు పెంచనుంది. ఏప్రిల్ నుంచే పెంపు అమల్లోకి రానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వేతన పెంపు చేయనున్న తొలి కంపెనీ ఇదే. దీంతో సంస్థలోని 4.7 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. ఆఫ్షోర్ ఉద్యోగులకు సగటున 6-7 శాతం మేర ఇంక్రిటెంటు ఉండొచ్చని ఈ పరిణామాలతో దగ్గరి సంబంధమున్న వ్యక్తులు పేర్కొన్నారు. ఆరు నెలల కాలంలోనే టీసీఎస్ చేస్తున్న రెండో వేతన పెంపు ఇది. ఇందువల్ల ఆరు నెలల వ్యవధిలోనే 12-14 శాతం మేర సగటు ఇంక్రిమెంటు ఉద్యోగులకు లభించినట్లు అవుతుందని ఆ వర్గాలు చెబుతున్నాయి.
గతేడాది అక్టోబరులో ఉద్యోగులకు కంపెనీ వేతన పెంపును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 2021 నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని ప్రాంతాల ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఇచ్చే పనిలో ఉన్నట్లు టీసీఎస్ ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు. పదోన్నతులను కూడా కంపెనీ కొనసాగించనుంది.






