అంబానీ సోదరులకు షాక్ … రూ. 25 కోట్ల జరిమానా
ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ, మరికొందరు వ్యక్తులు, సంస్థలపై మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ రూ.25 కోట్ల అపరాధ రుసుమును విధించింది. 2000 సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ టేకోవర్ నిబంధనలను పాటించని కేసులో ఈ నిర్ణయం తీసుకుంది. ముకేశ్ భార్య నీతా, అనిల్ భార్య టీనాలపైనా అపరాధ రుసుము విధించారు. ఆర్ఐఎల్ ప్రమోటర్లు, పర్సన్స్ యాక్టింగ్ ఇన్ కాన్సర్ట్ (పీఏసీ)లు 2000 సంవత్సరంలో సంస్థలో 5 శాతం వాటా కంటే ఎక్కువ కొనుగోలు అంశాన్ని బయటకు వెల్లడించడంలో విఫలమయ్యారని సెబీ తన 85 పేజీల ఆదేశంలో పేర్కొంది. ఈ క్రమంలోనే జరిమానా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. తండ్రి ధీరూభాయ్ అంబానీ నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని విభజించుకోవడం ద్వారా 2005లో ముకేశ్, అనిల్ విడివడిన సంగతి తెలిసిందే.






