ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సొంత ఇల్లు కోరుకుంటున్న ఖాతాదారులకు శుభవార్త అందించింది. గృహ రుణాల వడ్డీరేటుపై ప్రత్యేక రాయితీని ప్రకటించింది. గృహరుణాల కోసం దరఖాస్తు చేసుకునే రుణ గ్రహీతలకు మూడు ప్రయోజనాలు అందిస్తున్నట్టు ట్విటర్ వేదికగా తెలిపింది. ప్రాసెసింగ్ ఫీజు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రూ.30 లక్షలకు పైబడి కోటి రూపాయల కంటే తక్కువ రుణాలపై సిబిల్ స్కోరు ఎక్కువగా ఉన్న రుణగ్రహీతలకు 0.10 శాతం వడ్డీ రాయితీ ఇవ్వనుంది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా అయితే అదనంగా 0.5శాతం రాయితీ లభ్యం కానుంది. దీంతో రుణం మొత్తంపై 0.40 శాతం వరకు వినియోగదారులకు ఆదా అవుతుంది. ఉదాహరణకు ఓ ఖాతాదారు రూ.30 లక్షల రుణం 15 సంవత్సరాల కాలపరిమితిలో తీసుకుంటే అతడికి 1.52 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుంది. ప్రస్తుతం ఉద్యోగస్థులకు గృహ రుణాలపై 6.95 శాతం నుంచి 7.45 శాతం, సొంతవ్యాపారస్థుల రుణాలపై 7.10 శాతం నుంచి 7.60 మధ్య వడ్డీరేటు వసూలు చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి తరువాత రిజర్వు బ్యాంకు రెపో•రేటును 4 శాతానికి తగ్గించిన తరువాత గృహ రుణాలపై వడ్డీ రేటు దిగివచ్చింది.






