ఎస్బీఐ కీలక ప్రకటన
గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెంచినట్లు వచ్చిన వార్తలపై ఎస్బీఐ వివరణ ఇచ్చింది. హోంలోన్ వడ్డీ రేట్లను పెంచలేదని, గతంలో తాము పండుగ ఆఫర్ కింద ప్రకటించిన ప్రత్యేక రాయితీ మార్చి 31తో ముగిసిందని స్పష్టం చేసింది. ఈ గడువు తర్వాత హోంలోన్లపై వడ్డీ రేట్లు తిరిగి సాధారణ స్థాయికి చేరుకున్నాయని తెలిపింది. గత కొద్దిరోజులుగా ఎస్బీఐ గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరిగాయని వార్తలు వచ్చాయని, పండుగ సీజన్లో తాము ప్రకటించిన వడ్డీ రేట్లపై రాయితీల కాలపరిమితి ముగిసిందని, గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఇప్డుపు సాధారణ స్థితికి చేరాయని వెల్లడించింది.
గృహ రుణాలపై ప్రత్యేక రాయితీకి ముందు తాము ఆఫర్ చేసిన 6.95 శాతం వడ్డీరేటు కొనసాగుతుందని, అయితే మహిళలకు ప్రకటించిన ప్రత్యేక రాయితీ కొనసాగుతుందని పేర్కొంది. పండుగ సీజన్ సందర్భంగా మార్చి 31 వరకూ గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును ఎస్బీఐ ఎత్తివేసింది. రూ.75 లక్షల వరకూ గృహ రుణాలపై 6.70 శాతం వడ్డీ రేట్లను రాయితీ కింద ఆఫర్ చేసింది. ఇక రూ. 75 లక్షల నుంచి 5 కోట్ల వరకు గృహ రుణాలపై 6.75 శాతం వడ్డీరేటును ఆఫర్ చేసింది.






