చైనాకు శాంసంగ్ భారీ షాక్
టెక్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైనాకు భారీ షాక్ ఇచ్చింది. సుజోవోలోని తన ఆఖరి ఫ్యాక్టరీ నుంచి కూడా కంప్యూటర్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీనితో ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి ఉన్న 1700 మంది కార్మికుల్లో సగం మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. అయితే, ఫ్యాక్టరీలో ఉత్పత్తిని మాత్రమే నిలిపివేస్తున్నామని, కొత్త పరికరాల పరిశోధన, అభివృద్ధి కొనసాగుతుందని సంస్థ తెలిపింది. చైనా మాకు ఎప్పటికీ ముఖ్యమైన భాగస్వామి. ఆ దేశ ప్రజలకు అవసరమైన వస్తువులను ఉత్పత్తి చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం అని శాంసంగ్ పేర్కొంది. ఇది ఇలా ఉండగా, ఇటీవల చైనాలో కార్మికుల వేతనాల స్థాయి పెరిగింది. దీనితో పలు కంపెనీలు ఆ దేశంలో వస్తువుల ఉత్పత్తిని కొనసాగించడానికి ఇష్టపడడం లేదు. అందులో భాగంగానే శాంసంగ్ కూడా చైనాలో తమ ఫ్యాక్టరీలను ఒక్కొక్కటిగా మూసివేస్తున్నట్లు తెలుస్తోంది. చైనాలోని తమ చిట్టచివరి స్మార్ట్ ఫోన్ తయారీ ఫ్యాక్టరీని కూడా శాంసంగ్ గత ఏడాది మూసివేసింది.






