Russia: చమురు కొనుగోలు దారులు కావలె.. ఆంక్షల నడుమ రష్యా వెతుకులాట

అమెరికా ఆంక్షలతో పలుదేశాలు రష్యా (Russia) నుంచి దిగుమతులకు దూరమయ్యాయి. మరికొన్ని దేశాలు వాటి చమురు దిగుమతులను తగ్గించుకుంటున్నాయి. ఫలితంగా చమురు ఎగుమతులపై ఆధారపడిన రష్యాకు.. కాస్త ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యాయి. దీంతో చమురు కొనుగోలుదారుల కోసం రష్యా ఆయిల్ కంపెనీలు సెర్చింగ్ ప్రారంభించాయి.ఎన్ఎల్జీ సరఫరా చేస్తున్న భారీ నౌకలు ఆసియా వైపు వెళ్లడం చర్చనీయాంశంగా మారాయి.
ది ఐరిస్, వోస్కోడ్ నౌకలు సైబీరియాలోని ఆర్కిటిక్ ఎల్‌ఎన్‌జీ-2 ప్లాంట్ నుంచి ఉత్తర ఆసియాకు బయల్దేరాయి. ఉత్తర సముద్ర మార్గంలో ప్రయాణం మొదలుపెట్టాయని బ్లూమ్‌బెర్గ్‌షిప్ ట్రాకింగ్ డేటా వెల్లడిస్తోంది. వాస్తవానికి ఈ ట్యాంకర్లు కొన్ని నెలల పాటు సముద్రంలో ఖాళీగా ఉన్నాయి.
ఆర్కిటిక్-2(Arctic) ప్లాంట్‌ను నోవాటెక్ పీజేఎస్‌సీ నిర్వహిస్తోంది. 2030 నాటికి రష్యా గ్యాస్ ఎగుమతులను మూడింతలు చేయాలన్న లక్ష్య సాధన ఈ కంపెనీ అత్యంత కీలకమైంది. యూరప్ నుంచి పైప్‌లైన్‌లో గ్యాస్ కొనుగోళ్లు తగ్గాక ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తూ మాస్కో ఈ లక్ష్యాన్ని ఎంచుకొంది.
ఆర్కిటిక్-2 ప్లాంట్ గత వేసవిలో దాదాపు ఎనిమిది కార్గోలను ఎగుమతి చేసింది. కానీ, అక్టోబర్ నాటికి మంచు తీవ్రం కావడంతో కొనుగోలుదారులు దొరక్క ఉత్పత్తి నిలిపివేసింది. ఈ ప్లాంట్‌పై బైడెన్ కార్యవర్గం ఆంక్షలు విధించింది. ఆర్కిటిక్-2 ఈ ఏడాది జూన్‌లో తిరిగి నౌకల్లో ఎల్‌ఎన్‌జీ నింపడం మొదలు పెట్టింది. ఇప్పటివరకు అక్కడినుంచి బయల్దేరిన నౌకలు ఏ పోర్టులోనూ ఆగలేదు. ఇక్కడినుంచి ఆసియాకు బయల్దేరిన నాలుగు నౌకలు కొనుగోలు దారులను వెతుక్కొంటూ ఆసియాకు బయల్దేరాయి. మంచులో ప్రయాణించే మరో డజన్ నౌకలను ఆర్కిటిక్-2 కోసం సిద్ధంగా ఉంచారు. రష్యా నుంచి చమురు, సహజవాయువు అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్, చైనా ముందు వరుసలో ఉన్నాయి.