రిలయన్స్ రిటైల్ కు రూ. 5,550 కోట్లు
ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ రిలయన్స్ రిటైల్‌లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. గత కొద్ది రోజులుగా పలు పెద్ద కంపెనీలు రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడులు పెడుతున్నాయి. అమెరికాకు చెందిన అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ నుండి రూ. 5,550 కోట్ల నగదు అందినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గురువారం ప్రకటించింది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ కు ఎలైసియం ఆసియా హోల్డింగ్స్ (కేకేఆర్ లో ఒక యూనిట్) నుంచి రూ.5,550 కోట్లు వచ్చాయని, దానికి బదులుగా 81,348,479 ఈక్విటీ షేర్లను కేకేఆర్ కు కేటాయించినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ మార్కెట్ లో తెలిపింది. రిలయన్స్ రిటైల్ ఇప్పటివరకు మొత్తం రూ.37,710 కోట్లు సమీకరించింది. ఈ పెట్టుబడిలో సిల్వర్ లేక్, కెకెఆర్, జనరల్ అట్లాంటిక్, జిఐసి మరియు టిపిజి కంపెనీలు ఉన్నాయి. రిలయన్స్ రిటైల్ భారతదేశవ్యాప్తంగా 12,000 స్టోర్లను నిర్వహిస్తోంది.






