Google: గూగుల్, ఫేస్‌బుక్‌లకు ఊరట

వాణిజ్య చర్చల్లో అమెరికాను మెప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో చర్య తీసుకుంది. గూగుల్ (Google) , ఫేస్‌బుక్ (Facebook) , ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వంటి ఆన్‌లైన్ డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చే ప్రకటనలపై ఈక్వలైజేషన్ లెవీ పేరుతో విధించే 6 శాతం పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. గూగుల్ ట్యాక్స్‌గా పేరొందిన ఈ పన్నును ఏప్రిల్ 1 నుంచి రద్దు చేస్తున్నట్టు తెలిపిది. దీనికి సంబంధించి ఆర్థిక బిల్లు, 2025కు చేసిన సవరణకు పార్లమెంట్ (Parliament)కూడా ఆమోద ముద్ర వేసింది. దీంతో అమెరికా-భారత్ మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు సానుకూలంగా ముగిసే అవకాశాలు మరింత మెరుగయ్యాయని భావిస్తున్నారు.
ఈ డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారాల్లో దేశీయ కంపెనీలు ఇచ్చే ప్రకటనలపై 2016లో ప్రభుత్వం ఈ పన్ను విధించింది. దీనిపై అమెరికా గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పన్నును వెనక్కి తీసుకోకపోతే భారత్ నుంచి దిగుమతయ్యే రొయ్యలు (Shrimp) , బాస్మతి బియ్యం (Basmati rice ) పై తామూ అదే స్థాయిలో పన్ను విదిస్తామని హెచ్చరించింది. తాజా చర్యతో ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై ప్రకటనల ఖర్చు తగ్గడంతో పాటు వాటి లాభాలూ పెరుగుతాయని భావిస్తున్నారు.