రిలయన్స్ మరో రికార్డు…100 బిలియన్ డాలర్ల క్లబ్లో…

దేశంలో అటు కిరాణ రంగంలో, ఎలక్ట్రానిక్ రంగంలో పేరుగాంచిన అతిపెద్ద పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ కు చెందిన రిలయన్స్ రిటైల్ 100 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ మార్క్ సాధించిన 4వ భారతీయ కంపెనీగా అవతరించింది. కిరాణా నుంచి ఎలక్ట్రానిక్స్ వరకూ దేశవ్యాప్తంగా రిటైల్ చెయిన్ నిర్వహిస్తున్న కంపెనీ ఈ సరికొత్త మార్కును అందుకుంది. అయితే రిలయన్స్ రిటైల్ లిస్టెడ్ కాకపోయినా కూడా షేర్లు ఒక్కొక్కటి రూ .1,500, రూ .1,550 పరిధిలో ఉన్నాయి. ఒక్కో షేరుకు 1,500 రూపాయల చొప్పున సంస్థ విలువ 7.5 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. కంపెనీ గత ఏడాది వాటాలు విక్రయించడం ప్రారంభించిన నేపథ్యంలో కంపెనీ వాల్యూ ఏకంగా మూడు రెట్లు పెరిగింది. డిసెంబర్ 2019 లో రిలయన్స్ రిటైల్ షేర్లు రూ.900 వద్ద ఉన్నాయి. దీనికితోడు రిలయన్స్ రిటైల్ వాటాదారులకు రిలయన్స్ రిటైల్ నాలుగు షేర్లకు బదులుగా ఆర్‍ఐఎల్‍లో ఒక వాటాను ఇచ్చేలా స్కీమ్ ప్రకటించింది. ఈ పథకం తరువాత రిలయన్స్ రిటైల్ షేర్లు ఒక్కో షేరుకు 380 రూపాయలకు పడిపోయాయి. జనవరిలో రిలయన్స్ ఈ పథకాన్ని ఆఫ్షనల్ గా చేసింది. అప్పటి నుండి మంచి పనితీరును కనబరిచిన రిలయన్స్ రిటైల్ 2020 డిసెంబర్ 31 తో ముగిసిన మూడవ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభంలో 88.1 శాతం వృద్ధితో నమోదు చేసింది తద్వారా 1,830 కోట్ల రూపాయలను ఆర్జించింది. రిలయన్స్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించాలన్న ఆలోచనలో ఉంది.