ఐఏసీసీ జాతీయ అధ్యక్షుడిగా ప్రముఖ పారిశ్రామికవేత్త
ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) జాతీయ అధ్యక్షుడిగా హైదరాబాద్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సూరపనేని పూర్ణచంద్ర రావు ఎన్నికయ్యారు. ఈ పదవి చేపట్టిన రెండో తెలుగు వ్యక్తి కావడం గమనార్హం. ప్రస్తుతం నగరంలోని గ్లోబల్ ఇన్ఫోవిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఐటీ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. 2018 నుంచి 2020 వరకు ఐఏసీసీకి జాతీయ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. 52 సంవత్సరాలుగా భారత, అమెరికా వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాలను సమన్వయం చేసే అత్యున్నత సంస్థగా ఐఏసీసీ వ్యవహరిస్తోంది. ముంబయిలోని సంస్థ ముఖ్య కార్యాలయంలో జరిగిన బోర్డు సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాల మెరుగుదలకు కృషి చేస్తానని ఆ సందర్భంగా పూర్ణచంద్రరావు తెలిపారు.






