UK: యూకేతో మోడీ కీలక సంతకం, తగ్గనున్న ధరలు ఇవే..!

విదేశాలతో వాణిజ్య ఒప్పందాల విషయంలో దూకుడు ప్రదర్శిస్తోన్న నరేంద్ర మోడీ సర్కార్.. యూకేతో వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసింది. గురువారం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) యూకే పర్యటన సందర్భంగా భారత్ – యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసారు. ఆ దేశ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్‌తో ప్రధాని మోడీ సమావేశం అయ్యారు. ఈ ఒప్పందంపై వాణిజ్య మంత్రి పియూష్ గోయల్, బ్రిటిష్ వ్యాపార మరియు వాణిజ్య శాఖ కార్యదర్శి జోనాథన్ రేనాల్డ్ సంతకాలు చేసారు.
ఈ వాణిజ్య ఒప్పందం మూడు సంవత్సరాలుగా చర్చల దశలో ఉంది. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు ఏటా 34 బిలియన్ డాలర్లకు పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పలు కీలక రంగాలలో భారతీయులకు వృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలకు కొత్త మార్గాలను తెరవాలని భారత్ భావిస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్థిక సేవలు, వృత్తిపరమైన సేవలు, మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ, ఆర్కిటెక్చరల్ మరియు ఇంజనీరింగ్ వంటి రంగాల్లో కెరీర్ నిర్మించుకోవాలని భావిస్తోన్న యువతకు ఈ ఒప్పందం కీలకంగా మారనుంది.
ఈ ఒప్పందం తర్వాత భారత్ లో వ్యాపారాలు చేసేందుకు 26 బ్రిటీష్ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇక్కడి నుంచి భారత్ లో కొన్ని ధరలు తగ్గుతాయి. యూకేలో తయారైన వైద్య పరికరాలు, ఏరోస్పేస్ విడి భాగాలను భారత్ తక్కువ ధరకే దిగుమతి చేసుకోనుంది. వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత సగటున సుంకాలు 15 శాతం నుండి 3 శాతానికి తగ్గుతాయి. కాబట్టి, శీతల పానీయాలు, సౌందర్య సాధనాలు, చాక్లెట్లు, బిస్కెట్లు, లాంబ్, సాల్మన్, కార్లు వంటి బ్రిటిష్ ఉత్పత్తులు కూడా భారతీయులకు సులభంగా అందుబాటులో ఉంటాయి.
ఎలక్ట్రిక్ వాహనాలపై(EV) 110 శాతం నుండి 10 శాతానికి సుంకం తగ్గుతుంది. ఈ వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత, బ్రిటిష్ సంస్థలు విస్కీ, ఇతర ఉత్పత్తులను భారతదేశానికి ఎగుమతి చేయడం సులభతరం అవుతుంది. విస్కీపై దిగుమతి సుంకం వెంటనే 150 శాతం నుండి 75 శాతానికి, 10 సంవత్సరాలలో 40 శాతానికి తగ్గుతుంది.
ఉత్పత్తులతో పాటు, వాణిజ్య ఒప్పందం భారతీయులు.. యూకేలో నివసించడాన్ని ఈ వాణిజ్య సులభతరం చేయనుంది. ఆ దేశంలో ఆఫీసులు లేకపోయినా.. భారత నిపుణులు ఇప్పుడు యూకేలో 35 రంగాలలో 2 సంవత్సరాల పాటు పని చేసే అవకాశం రానుంది. ఈ చర్య ప్రతి ఏటా.. 60,000 కంటే ఎక్కువ మంది ఐటీ నిపుణులకు ప్రయోజనం చేకూరుస్తుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రధాన లబ్ధిదారులలో టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్ మరియు విప్రో ఉన్నాయి.