ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ నాలుగో స్థానం
భారతీయ అపర కుబేరుడు ముకేశ్ అంబానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో దూసుకుపోతున్నారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) అధిపతి నాల్గవ స్థానానికి ఎగబాకారు. టాప్-500 బిలియనీర్లతో విడుదలైన ఈ తాజా జాబితాలో ముకేశ్ సంపద 80.6 బిలియన్ డాలర్లుగా ఉన్నది. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, మెక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఫేస్బుక్ సారథి మార్క్ జుకర్బర్గ్లు మాత్రమే ఈ జాబితాలో ముకేశ్ కంటే ముందున్నారు. నిజానికి దశాబ్దాలుగా ప్రపంచ టాప్-5 కుబేరుల్లో అమెరికన్లే ఉంటున్నారు. లేదంటే ఒకరిద్దరు యూరోపియన్లకు స్థానం లభిస్తున్నది. ఎప్పుడో ఒక్కసారి మెక్సికన్ కనిపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆసియా ఖండానికి చెందిన, అదీ ఓ భారతీయుడు ఉండటం తొలిసారి.






