భారత ఆర్థిక వ్యవస్థ చాలా దేశాల కంటే మెరుగ్గానే ఉంది: ఐఎంఎఫ్ డైరెక్టర్
ప్రపంచంలో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు మందగమనం ఉన్నాయని, వాటితో పోలిస్తే భారత దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలోనే ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ ఆసియా-పసిఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్ అన్నారు. చాలా దేశాల్లో వృద్ధి రేటు నెమ్మదిస్తోందని, ద్రవ్యోల్బణం కూడా పెరుగుతోందని ఆయన చెప్పారు. ఒక వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు చెప్పారు. ఒకసారి ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులను గమనించాలని, ఇది అన్ని దేశాలన వేధిస్తున్న సమస్యనే అని తెలిపారు. ప్రస్తుతం చాలా దేశాల్లో ఆర్థిక వృద్ధి నెమ్మదించదాంతోపాటు ద్రవ్యోల్బణం పెరుగుతోందని చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో మూడింట ఒక వంతు ఆర్థిక వ్యవస్థ గల దేశాలు ఈ ఏడాది కానీ, వచ్చే సంవత్సరం కానీ ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తాము భావిస్తున్నామన్నారు. “దాదాపు ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తోంది. వాటితో పోలిస్తే భారత దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గానే ఉంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ఇతర దేశాలతో పోల్చినపుడు భారత దేశం సాపేక్షంగా మెరుగైన స్థితిలోనే ఉంది” అని శ్రీనివాసన్ స్పష్టం చేశారు.






