మైక్రోసాఫ్ట్ చేతికి టిక్‌టాక్!
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ యాప్ టిక్‌టాక్ కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. సెప్టెంబర్ 15 కల్లా చర్చలన్నీ పూర్తి కావొచ్చని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడి అభ్యంతరాలను మైక్రోసాఫ్ట్ అర్థం చేసుకుందని, సమాచార భద్రతకు లోబడి, అమెరికాకు ఆర్థిక లాభం చేకూర్చే విధంగా టిక్‌టాక్‌ను స్వాధీనం చేసుకోనున్నట్లు తెలిపింది. టిక్‌టాక్‌తో ఒప్పందం కుదిరితే, అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీల్యాండ్ దేశాల్లోని కార్యకలాపాలన్నీ మైక్రోసాఫ్ట్ చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఈ ఒప్పందంలో పెట్టుబడి పెట్టేందుకు ఇతర అమెరికా మదుపర్లుకు కూడా అవకాశం కల్పిస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. టిక్‌టాక్‌లోని అమెరికా పౌరుల డాటా ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతర దేశాలతో పంచుకోకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది.






