ఒరాకిల్ చేతికి టిక్‌టాక్
అమెరికాలో బహుళజాతి కంప్యూటర్ టెక్నాలజీ సంస్థ ఒరాకిల్‌తో టిక్‌టాక్ జట్టు కట్టింది. అగ్రరాజ్యంలో తమ కార్యకలాపాల కోసం సాంకేతిక భాగస్వామిగా ఒరాకిల్ను ఈ చైనా వీడియో షేరింగ్ వేదిక ఎంచుకున్నది. ఈ మేరకు ఇరు సంస్థలు ప్రకటించాయి. దీంతో టిక్‌టాక్‌ను సొంతం చేసుకోవాలన్న మైక్రోసాఫ్ట్-వాల్‌మార్ట్ ప్రయత్నాలు విఫలమైనట్లైంది. జాతీయ భద్రతకు ముప్పుగా చూపుతూ దేశీయ కార్యకలాపాలను అమెరికా సంస్థకు అమ్ముకోకపోతే ఈ నెల 20 నుంచి టిక్‌టాక్ యాప్‌పై నిషేధం విధిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఒరాకిల్ చేతికి అమెరికా టిక్‌టాక్ ఆపరేషన్స్ వచ్చాయి. అయితే ఈ డీల్ విలువ, టిక్‌టాక్‌లో ఒరాకిల్‌కు మెజారిటీ వాటా ఏదైనా దక్కబోతున్నదా? అన్న వివరాలపై మాత్రం సృష్టత లేకుండా ఉన్నది. అమెరికాలో టిక్‌టాక్ వ్యాపారాన్ని సుమారు రూ.1.84 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ డీల్‌కు అమెరికా ప్రభుత్వం అనుమతి కూడా రావాల్సి ఉన్నది. కాగా, మా అమెరికా కార్యకలాపాలను మీకు అమ్ముబోవడం లేదు అని టిక్‌టాక్ యాజమాన్యం బైట్‌డాన్స్ తమతో చెప్పినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.






