హైదరాబాద్‌లో అమెరికన్ సంస్థ 1200 కోట్ల పెట్టుబడులు
వైద్య పరికరాల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెడ్‌ట్రానిక్ సంస్థ హైదరాబాద్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. అమెరికా అవతల తన అతి పెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్‌లో స్థాపించాలని నిర్ణయించింది. ఇందుకుగాను రానున్న ఐదేండ్లలో రూ.1200 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే మెడ్‌ట్రానిక్ ఇంజినీరింగ్, ఇన్నోవేషన్ సెంటర్ అమెరికా అవతల అతి పెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం కానున్నది. ఈ పెట్టుబడుల ద్వారా హైదరాబాద్ మెడికల్ డివైజస్ హబ్‌గా కూడా మారనున్నది. తెలంగాణ ప్రభుత్వం, మెడ్‌ట్రానిక్ కంపెనీ ఈ ప్రాజెక్టుపై రెండేండ్లుగా చర్చలు జరుపుతున్నాయి.
2016లో ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటించినప్పుడు మెడ్‌ట్రానిక్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఒమర్ ఇస్రాక్‌తో సమావేశమయ్యారు. దానికి కొనసాగింపుగా మంత్రి కేటీఆర్‌తో జరిగిన వర్చువల్ సమావేశంలో తమ పెట్టుబడికి సంబంధించిమెడ్ట్రానిక్ సంస్థ ప్రకటన చేసింది. పరిశోధన, అభివృద్ధి ఇన్నోవేషన్‌కు దారితీస్తుందని, ఇన్నోవేషన్ తమ కంపెనీ అభివృద్ధికి అత్యంత కీలకమైందని ఒమర్ ఇస్రాక్ పేర్కొన్నారు. ఈ పెట్టుబడి భారతదేశం పట్ల తమ చిత్తశుద్ధికి, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తాము తీసుకున్న నిర్ణయాన్ని సూచిస్తుందని తెలిపారు. రోగుల బాధను దూరంచేసిన, వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలన్న తమ కంపెనీ లక్ష్యాలతోపాటు ఆరోగ్యరంగాన్ని మరింత విస్తరించాలన్న ప్రభుత్వ లక్ష్యాల మేరకు ఈ భాగస్వామ్యం ఉంటుందని ఆయన చెప్పారు.
మెడ్‌ట్రానిక్ కంపెనీ హైదరాబాద్‌ను తమ అతిపెద్ద ఆర్‌అండ్‌టీ సెంటర్‌కు గమ్యస్థానంగా ఎంచుకోవడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడి ద్వారా పెద్దఎత్తున ఉద్యోగాల కల్పనతోపాటు ఈ రంగంలో మరిన్ని కొత్త పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కంపెనీ పెట్టుబడి ద్వారా హైదరాబాద్ భారతదేశపు మెడికల్ డివైజెస్ హబ్‌గా మారుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మెడ్‌టెక్ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, మెడ్ట్రానిక్తో ఒప్పందం దీనిని సూచిస్తున్నదని తెలిపారు. మెడికల్ డివైజెస్ కంపెనీలతో కలిసి ప్రపంచ ఆరోగ్య రంగంలో సానుకూల మార్పు దిశగా పని చేస్తామని తెలిపారు. మెడికల్ డివైజెస్ రంగంలో కొన్నేండ్లుగా చేపట్టిన కార్యక్రమాలను మంత్రి వివరించారు. కంపెనీ నూతన సీఈవోగా ఎంపికైన జెఫ్రీ ఎస్ మార్తాను కేటీఆర్ అభినందించారు.






