ఉద్యోగులకు ఇన్ఫోసిస్ ఆఫర్ .. అక్కడికి బదిలీ అయితే

ప్రముఖ దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు ఆకర్షణీయ బదిలీ ప్యాకేజీని ప్రకటించింది. కర్ణాకటలోని హుబ్బళ్లిలో నెలకొల్పిన డెవలప్‌మెంట్ సెంటర్‌లో పనిచేయడానికి ముందుకొస్తే రూ.8 లక్షల వరకు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపింది. ఈ మేరకు ఉద్యోగులకు ఇటీవల ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని అందించింది. అభివృద్ధి చెందడానికి మెరుగైన అవకాశాలున్న హుబ్బళ్లిలో పనిచేసే ప్రతిభావంతుల కోసం వేచి చూస్తున్నామని అందులో పేర్కొంది. ప్రాజెక్టు డెవలప్‌మెంట్ విధుల్లో ఉన్న బ్యాండ్-2, ఆ పైస్థాయి ఉద్యోగులకు బదిలీ ప్రోత్సాహకాలు అందిస్తామని ఇన్ఫోసిస్ తెలిపింది. భారత్‌లోని ఏ డెవలప్‌మెంట్ సెంటర్ నుంచైనా ఉద్యోగులు ఇక్కడికి రావొచ్చంది.
బ్యాండ్ 3, అంతకంటే దిగువస్థాయి ఉద్యోగులకు బదిలీ సమయంలో రూ.25,000 అందిస్తామని తెలిపింది. ఆ తర్వాత ప్రతీ ఆరు నెలలకు రూ.25 వేల చొప్పున రెండేళ్ల పాటు ఇస్తామని వెల్లడించింది. మొత్తం మీద వీరు రూ.1.25 లక్షల ప్రోత్సాహకాలు అందుకోనున్నారు. అలా బ్యాండ్ 4 ఉగ్యోగులకు రూ.2.5 లక్షలు, బ్యాండ్ 5 రూ.5 లక్షలు, బ్యాండ్ 6 స్థాయి ఉద్యోగులకు రూ.8 లక్షల ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపింది.