కర్నూలు నుంచి ఇండిగో విమాన సర్వీసులు
కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖ, చెన్నై నగరాలకు విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. రీజినల్ కనెక్టివిటీ పథకం (ఉడాన్) లో భాగంగా మార్చి 28 నుంచి ఈ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణ భారతదేశంలో రీజినల్ కనెక్టివిటీని పెంచేందుకు ఈ సర్వీసులను ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌కు అనుమతి లభించిన నేపథ్యంలో రీజినల్ కనెక్టివిటీ అవసరమని మేం భావిస్తున్నాం అని ఇండిగో ప్రధాన స్ట్రాటజీ, రెవెన్యూ అధికారి సంజయ్‌కుమార్ తెలిపారు.
కొత్తగా ప్రారంభించే బెంగళూరు-కర్నూలు, విశాఖపట్నం-కర్నూలు, చెన్నై-కర్నూలు మార్గాల్లో వారానికి నాలుగు సర్వీసులుంటాయని ఆ సంస్థ ఆ ప్రకటనలో వెల్లడించింది. ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధి, రీజినల్ కనెక్టివిటీ కోసం ఉడాన్ పథకం ప్రారంభించారు. సామాన్యుడికి కూడా విమాన ప్రయాణం సరసమైన ధరల్లో అందుబాటులో ఉంచేందుకు కేంద్రం 2017లో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.






