ఇండియా, ఇజ్రాయెల్, అమెరికా కలిసి పనిచేయాలని నిర్ణయం
ఐదో తరం (5జీ) టెక్నాలజీ వ్యవస్థను సంయుక్తంగా అభివృద్ధి చేయాలని భారత్, అమెరికా, ఇజ్రాయెల్ నిర్ణయించాయి. దీనితోపాటు సాంకేతికరంగంలో ఏరోజుకారోజు చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా పరిశోధనలు చేయాలన్న అంగీకారానికి వచ్చాయని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ పరస్పర సహకారంలో 5జీ టెక్నాలజీ అభివృద్ధి తొలి అడుగు మాత్రమేనని అమెరికాకు చెందిన అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్ ఎయిడ్) అధికారి బోనీ గ్లిక్ పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇండియా ప్రతినిధుల మధ్య వర్చువల్గా జరిగిన కార్యక్రమంలో గ్లిక్ మాట్లాడారు. రాబోయే తరాల సాంకేతిక విప్లవాలకు అనుగుణంగా తమ పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయని ఆమె వివరించారు.
సిలికాన్వ్యాలీ, బెంగళూరు, టెల్ అవీవ్ కలిసి పనిచేయడం చాలా ముఖ్యమన్నారు. అత్యంత భద్రత, నమ్మకంతో కూడిన 5జీ టెక్నాలజీని అందించేందుకు మూడు దేశాలు కలిసి పనిచేయడం అవసరమని గ్లిక్ పేర్కొన్నారు. అయితే, 5జీ టెక్నాలజీ విషయంలో ఏ దేశమూ ఆధిపత్యం వహించడానికి తాము అనుమతించబోమని సృష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియాలో ఇజ్రాయెల్ రాబాయరి ర్యాన్ మల్కా, ఇజ్రాయెల్లో ఇండియా రాయబారి సంజీవ్ సింగ్లా కూడా ప్రసంగించారు.






