India : అమెరికా దిగుమతులపై సుంకాల తగ్గింపు దిశగా భారత్

అమెరికాతో జరుగుతున్న వాణిజ్య చర్చల్లో భారత్ కొత్త ప్రతిపాదన చేసింది. ఏప్రిల్ 2 నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) విధించిన ప్రతీకార సుంకాలు అమల్లోకి వస్తున్నందున వీటని నివారించేందుకు భారత్ చురుగ్గా పని చేస్తోంది. ప్రస్తుతం అమెరికాతో జరుగుతున్న వాణిజ్య చర్చల్లో దీనికి ఆ దేశం నుంచి భారత్‌కు వస్తున్న దిగుమతులపై విధిస్తున్న సుంకాలను 50 శాతం తగ్గిస్తామని ప్రతిపాదించింది. ప్రస్తుతం అమెరికా (America) నుంచి భారత్‌కు ఏటా 23 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు జరుగుతున్నాయి. అదే సమయంలో భారత్ నుంచి అమెరికా 66 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరుగుతున్నాయి. ఈ ఎగుమతులును రక్షించుకునేందుకు అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలు (Tariffs) తగ్గిస్తామని తెలిపింది. తమ దిగుమతులపై భారత్ అన్యాయంగా సుంకాలు విధిస్తోందని, కొన్నింటిపై 100 శాతం కంటే ఎక్కువ విధిస్తోందని ట్రంప్ పదే పదే ఆరోపిస్తున్నారు. దీనికి ప్రతీకారంగానే భారత్ దిగుమతులపై సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. అమెరికా విధించే ప్రతీకార సుంకాల ప్రభావం మన ఎగుమతుల్లో 87 శాతంపై ప్రభావం చూపుతుందని భారత్ అంచనా వేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వాణిజ్య చర్చల్లో అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న వాటిలో 55 శాతం వస్తువులపై సుంకాలు తగ్గించడానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. వీటిపై ఇక నుంచి సుంకాలు 5 నుంచి 30 శాతం మాత్రమే విధిస్తామని ప్రతిపాదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.