America : ద్వితీయార్ధంలో అమెరికాలో మాంద్యం!

ప్రస్తుత ఏడాది ద్వితీయార్ధంలో అమెరికా (America)లో ఆర్థిక మాంద్యం ప్రభావాలు పెరగొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వాణిజ్య టారీఫ్‌ల (Trade tariffs ) ఉద్రిక్తతలు, ద్రవ్య సర్దుబాట్ల పర్యవసానాలతో ఇన్వెస్టర్లు, విధాన నిర్ణేతలు సతమతమవుతున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో యూఎస్ మార్కెట్‌లో రానున్న రోజుల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయని మెజారిటీ ఆర్ధిక నిపుణులు (Financial experts) అంచనా వేస్తున్నారు. మాంద్యాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వ వ్యూహాత్మక ఆర్థిక జోక్యాలు అవసరమని సూచిస్తున్నారు. ఆర్ధిక కార్యకలాపాలు మందగించడంతో 2025 మార్చి త్రైమాసికంలో జిడిపి వృద్ధి (GDP growth) తగ్గొచ్చని హెచ్చరిస్తున్నారు. మార్చి త్రైమాసికంలో యూఎస్ జీడీపీ వృద్ధి 1.4 శాతానికి పరిమితమయ్యింది. 2024 చివరి మూడు నెలల్లోని 2.3 శాతం వృద్ధితో పోల్చితే చాలా మందగించింది. వాణిజ్య లోటు పెరగడం, వినియోగదారుల వ్యయం మందగించడం, శీతాకాల కార్యకలాపాలు ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా మారాయని నిపుణులు పేర్కొంటున్నారు. దిగుమతులు పెరగడం, ఎగుమతులు స్తంభించడంతో వాణిజ్య లోటు రికార్డు స్థాయికి చేరుకుంది. ఒక్క జనవరిలో 2025లోనే వస్తు, సేవల వాణిజ్య లోటు 131.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. మందగమనం భయాలతో అమెరికా పౌరులు విచక్షణ, అచీతూచి కొనుగోళ్లు చేస్తున్నారు. చాలా కుటుంబాలు అత్యవసరం కాని కొనుగోళ్ల కంటే అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు.