భారత్ కు హార్లే డేవిడ్సన్ గుడ్‌బై ?
అమెరికన్ లగ్జరీ మోటర్‌సైకిల్ బ్రాండ్ హ్యార్లీ డేవిడ్సన్ భారతీయ మార్కెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీలక మార్కెట్లపై దృష్టి పెట్టాలన్న సంస్థ నిర్ణయం నేపథ్యంలో ఈ ఊహాగానాలకు బలం చేకూరుతున్నది. పెట్టుబడులకు తగ్గ వ్యాపారం దేశంలో జరుగకపోవడం కూడా భారత్‌కు బైబై చెప్పేందుకు దారి తీస్తున్నట్లు సమాచారం. ఆదరణ అంతంతమాత్రంగా ఉండటంతో లాభాలు నిరాశాజనకంగా ఉన్నాయని తెలుస్తున్నది. కాగా, హర్యానాలోని బవల్ ప్లాంట్‌ను ఇతర సంస్థలకు ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వాలన్న యోచనలో హ్యార్లీ డేవిడ్సన్ ఉందంటున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2019-20) దేశంలో దాదాపు 2,500 బైకులను హ్యార్లీ అమ్మింది. లాగే సుమారు 2,100 మోటర్ సైకిళ్లను బయట దేశాలకు ఎగుమతి చేసింది. ఇక ఈ ఏప్రిల్-జూన్లోనైతే నిరుడుతో పోల్చితే అమ్మకాలు 87 శాతం పడిపోయి 106 యూనిట్లుగా, ఎగుమతులు 40 శాతం దిగజారి 229 యూనిట్లకు పరిమితమయ్యాయి.






