గూగుల్ పే యాప్లో మరో కొత్త అప్డేట్
గూగుల్ పే తన వినియోగదార్ల గోప్యతా ప్రమాణాలను మరింత పెంచుతోంది. వచ్చే వారం ఈ యాప్లో తీసుకురానున్న అప్డేట్ వల్ల వినియోగదార్లకు తమ లావాదేవీల సమాచారంపై అదనపు నియంత్రణకు వీలు కలుగుతుంది. నియంత్రణ ఉండాలా వద్దా అన్నది కూడా వినియోగదార్ల ఇష్టమే. గూగుల్ పేలో ఏదైనా లావాదేవీ చేస్తున్నప్పుడు, సంబంధిత వివరాలను వినియోగించుకోవడం లేదా రికార్డ్ కావడం అన్నది పూర్తిగా వినియోగదారుడి ఇష్టానికి వదిలేస్తున్నట్లు గూగుల్ పే వైస్ ప్రెసిడెంట్ అంబరీశ్ కెంఘే పేర్కొన్నారు.
ఉదాహరణకు మొబైల్ ఫోన్ రీఛార్జి చేసినపుడు ఈ డేటాను ఆఫర్లు, రివార్డులకు ఉపయోగించుకోవచ్చా లేదా అన్న విషయాన్ని వినియోగదారుడే నిర్థారించుకోవచ్చు. పర్సనలైజేషన్ వితిన్ గూగుల్ పే ను ఆన్ చేయడం ద్వారా మరిన్ని ఎంపిక చేసుకోవడానికి వీలుంటుందని ఆయన వివరించారు. కాగా, కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల నెలవారీ చురుకైన వినియోగదార్లుండగా అందులో ఎక్కువ భాగం భారతీయులే.






