మరో కొత్త వివాదంలో గూగుల్ …
అంకురాల అభివృద్ధిని అడ్డకునేందుకు ప్రయత్నిస్తోందని ఇప్పటికే భారత్‌లో నిరసనలు ఎదుర్కొంటున్న గూగుల్, మరో కొత్త వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్ టీవీలకు వినియోగిస్తున్న ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో మార్పులు చేయరాదని ఒత్తిడి చేస్తూ, పోటీరహిత వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపణాలు ఎదుర్కొంటోంది. జూన్ నుంచి ఈ విషయాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిశితంగా పరిశీలిస్తోందని, ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు న్యాయవాదులు తెలిపినట్లు ఒక వార్త సంస్థ వెల్లడించింది.
గూగుల్ ఇప్పటికే అమెరికా, చైనాలోనూ ఇదే తరహా కేసులను ఎదుర్కొంటోంది. ఆండ్రాయిడ్ వెర్షన్‌కు ఎలాంటి సవరణలూ చేసేందుకు గూగుల్ అనుమతించడం లేదని, దీనివల్ల స్మార్ట్ టీవీల డెవలపర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇందులో పేర్కొన్నారు. అయితే గూగుల్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొంది. ఈ ఆరోపణలపై గూగుల్‌ను సీసీఐ లిఖిత పూర్వక వివరణ అడిగిందని, దానికి కొంత సమయం ఇవ్వాలని గూగుల్ తెలిపిందని ఆ న్యాయవాదులు పేర్కొన్నారు.






