హైదరాబాద్ కు గోల్డ్‌మ్యాన్ శాక్స్ సెంటర్
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గోల్డ్‌మ్యాన్ శాక్స్ సంస్థ దేశంలో తన రెండో కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నది. గోల్డ్‌మ్యాన్ శాక్స్ సంస్థ రాకతో ప్రపంచ అగ్రశేణి సంస్థలు హైదరాబాద్‌ను తమ వ్యాపార కార్యకలపాలకు కేంద్రంగా చేసుకుంటున్నాయని మరోసారి నిరూపితమైంది. ఆ సంస్థ ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావుతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. మొదట్నుంచి ప్రపంచస్థాయి సంస్థలను హైదరాబాద్‌కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి కేటీఆర్ సంస్థ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన చర్చల్లో సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. అనంతరం హైదరాబాద్‌లో తమ రెండో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు గోల్డ్‌మాన్ శాక్స్ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అందిస్తున్న సేవలను మరింత విస్తృతంగా చేసేందు వీలుగా హైదరాబాద్ ఒక కొత్త, వినూత్నమైన కేంద్రంగా ఉంటుందని పేర్కొంది. దీనివల్ల తమ సంస్థ భౌగోళికంగా కేంద్రీకృతం కాకుండా.. స్థానిక ప్రతిభను ఉపయోగించుకుని ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసేలా, సుదీర్ఘకాలం నిలిచి ఉంటుందని పేర్కొంది.
హైదరాబాద్ కార్యాలయాన్ని 2021 రెండో అర్ధభాగంలో ప్రారంభిస్తామని గోల్డ్‌మ్యాన్ శాక్స్ తెలిపింది. సుమారు 500 మంది ఉద్యోగులతో దీనిని ఏర్పాటు చేస్తామని భవిష్యత్తులో సేవలను విస్తృతం చేస్తామని చెప్పింది. హైదరాబాద్‌లో నెలకొల్పనున్న కార్యాలయం బెంగళూరు శాఖతో పోటీపడుతుందని భావిస్తున్నట్టు పేర్కొన్నది. ఇక్కడి వ్యాపార భవన సదుపాయం, సంస్థ ఉద్యోగులకు అందుబాటులో ఉండే గృహాలు, విభిన్నమైన ప్రతిభ అందుబాటులో ఉండటం, నాణ్యమైన మౌలిక వసతులతోపాటు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నందునే కార్యాలయాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పాలని నిర్ణయించినట్లు సంస్థ తెలిపింది.
మంత్రి కేటీఆర్‌తో పాటు గోల్డ్‌మ్యాన్ శాక్స్ ఇండియా చైర్మన్ సంజయ్ఛటర్జీ, ఎండీ, ఇండియా హెడ్, గుంజన్ సంతాని, ఎండీ, ఛీప్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రవికృష్ణన్, రాష్ట్ర ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, ఐటీఈ అండ్ సీ శాఖ సీఆర్వో అమర్నాథ్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.






