ZS Office: హైదరాబాద్‌లో జెడ్‌ఎస్ కార్యాలయం
మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్, టెక్నాలజీ సంస్థ జెడ్‌ఎస్ హైదరాబాద్ (Hyderabad) లో కొత్త కార్యాలయం ప్రారంభించింది. హైటెక్ సిటీ (Hi-tech City)లోని రహేజా ఐటీ పార్క్‌లో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణం లో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయంలో 500-600 మంది ఉద్యోగులు పని చేయవచ్చని జెడ్‌ఎస్ వెల్లడించింది . దేశంలోని హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ జీసీసీల కోసం తన సర్వీస్ సామర్థ్యాలు విస్తరించే వ్యూహంలో భాగంగానే ఈ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలిపింది. హైదరాబాద్‌లో తాము కార్యకలాపాలు ప్రారంభించిన ఏడాది లోగానే ఈ వ్యూహాత్మక విస్తరణ కూడా చేపట్టినట్టు కంపెనీ రీజినల్ మేనేజింగ్ ప్రిన్సిపల్ మోహిత్ సూద్ తెలిపారు. అమెరికా (America)లోని ఇవాన్‌స్టన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జెడ్‌ఎస్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న 35 కార్యాలయాల్లో 13,000 మంది పని చేస్తున్నారు. భారత్‌లోని పుణె, హైదరాబాద్, బెంగళూరు (Bangalore), చెన్నై, గురుగ్రామ్, నోయిడా కార్యాలయాల్లో 10,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.







