Pakistan: పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ.. కునార్ నదిపై అఫ్గాన్ భారీ డ్యామ్ నిర్మాణం..!
నిన్న భారత్ పైప్ కట్ చేస్తే.. ఇప్పుడు అఫ్గాన్ నల్లా బిగిస్తోంది…! పాపం పండి.. పాకిస్తాన్ (Pakistan).. గొంతెండి పోవాల్సిందే..ఎందుకంటే పొరుగున ఉన్న దేశాలను గిల్లిన పాక్.. ఫలితం అనుభవిస్తోంది. మొన్న సింధు నది జలాలను భారత్ నిలిపివేయగా.. ఇప్పుడు అదే పరిస్థితి అఫ్గాన్ల రూపంలో పాక్ కు ఎదురవుతోంది. తమను ఇసరిహద్దుల్లో కవ్వించి, బ్బందులు పెడుతున్న పాక్ కు.. అఫ్గాన్ వాటర్ షాక్ ట్రీట్ మెంట్ అందిస్తోంది.అంటే పాకిస్తాన్ పరిస్థితి అదోగతి..!
ఇప్పటికే భారత్‌తో జల వివాదాలతో సతమతమవుతున్న పొరుగు దేశం పాకిస్థాన్‌కు తాలిబన్ల పాలనలోని ఆఫ్ఘనిస్థాన్ గట్టి షాక్ ఇచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహించే కీలకమైన కునార్ నదిపై భారీ డ్యామ్‌ను నిర్మించి, నీటి ప్రవాహాన్ని నియంత్రించాలని నిర్ణయించింది. ఈ మేరకు డ్యామ్ నిర్మాణ పనులను వీలైనంత వేగంగా ప్రారంభించాలని తాలిబన్ సుప్రీం లీడర్ మౌల్వీ హిఅబతుల్లా అఖుంద్జాదా జల, ఇంధన మంత్రిత్వ శాఖను ఆదేశించారు. ఇరు దేశాల మధ్య ఇటీవలే జరిగిన భీకర సరిహద్దు ఘర్షణల్లో వందలాది మంది మరణించిన కొన్ని వారాలకే అఫ్గానిస్థాన్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది..
ఆఫ్ఘన్ జల, ఇంధన మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. విదేశీ సంస్థల కోసం ఎదురుచూడకుండా, దేశీయ కంపెనీలతోనే ఒప్పందాలు కుదుర్చుకోవాలని సుప్రీం లీడర్ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు సమాచార శాఖ ఉప మంత్రి ముహాజెర్ ఫరాహీ ఎక్స్ వేదికగా తెలిపారు. ‘‘భారత్ తర్వాత, ఇప్పుడు పాకిస్థాన్‌కు నీటి సరఫరాను పరిమితం చేసే వంతు ఆఫ్ఘనిస్థాన్‌కు వచ్చినట్లుంది’’ అని లండన్‌కు చెందిన ఆఫ్ఘన్ జర్నలిస్ట్ సామి యూసఫ్‌జాయ్ వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్‌పై తీవ్ర ప్రభావం
ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ పర్వతాల్లో పుట్టే 480 కిలోమీటర్ల పొడవైన కునార్ నది, పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోకి ప్రవేశించి కాబూల్ నదిలో కలుస్తుంది. పాకిస్థాన్‌లో దీనిని చిత్రాల్ నది అని పిలుస్తారు. కాబూల్ నది ఆఫ్ఘన్-పాక్ మధ్య ప్రవహించే అతిపెద్ద నది. ఇది చివరకు అటోక్ వద్ద సింధు నదిలో కలుస్తుంది. కునార్ నదిపై డ్యామ్ నిర్మిస్తే, దాని ప్రభావం కాబూల్ నదిపై, ఆ తర్వాత సింధు నదిపై పడుతుంది. దీంతో పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాతో పాటు పంజాబ్ ప్రావిన్స్‌లో కూడా సాగునీరు, తాగునీటి అవసరాలకు తీవ్ర సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది.
భారత్‌తో స్నేహం.. పాక్‌తో కయ్యం
2021లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాలిబన్లు ‘‘జల సార్వభౌమత్వం’’పై ప్రత్యేక దృష్టి సారించారు. ఇంధన ఉత్పత్తి, సాగునీటి కోసం పొరుగు దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా డ్యామ్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. మరోవైపు, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మధ్య నీటి పంపకాలపై ఎలాంటి అధికారిక ఒప్పందం లేదు. ఆఫ్ఘన్ ఏకపక్ష నిర్ణయాలు ప్రాంతీయంగా తీవ్ర నీటి సంక్షోభానికి దారితీయవచ్చని పాకిస్థాన్ గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది.
వారం రోజుల క్రితమే ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి మౌల్వీ ఆమిర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో పర్యటించి, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య జలవిద్యుత్ ప్రాజెక్టులు, డ్యామ్‌ల నిర్మాణంపై సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే భారత్ సహాయంతో నిర్మించిన సల్మా డ్యామ్ (ఆఫ్ఘన్-ఇండియా ఫ్రెండ్‌షిప్ డ్యామ్), త్వరలో చేపట్టబోయే షహతూత్ డ్యామ్ ప్రాజెక్టులే ఇందుకు నిదర్శనం.







