రాత్రికి రాత్రే 500 మంది కోటీశ్వరులయ్యారు
దేశీయ వ్యాపార సాఫ్ట్వేర్ తయారీ సంస్థ ఫ్రెష్వర్క్స్కు చెందిన 500 మంది ఉద్యోగులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. వీరిలో 70 మంది 30 ఏళ్ల లోపు ఉన్నవారే కావడం విశేషం. అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్ నాస్డాక్లో ఫ్రెషవర్క్స్ షేర్లు లిస్ట్ కావడం, కంపెనీ షేర్ల ధరలు అకస్మాత్తుగా పెరగడంతో వీరి దశ తిరిగింది. ఐపిఒ ద్వారా కంపెనీ 1.03 బిలియన్ డాలర్లను సమీకరించింది. తమిళనాడులోని తిరుచ్చి అనే చిన్న పట్టణంలో 700 చదరపు అడుగుల గిడ్డంగితో ప్రారంభమైన ఈ కంపెనీ ఇప్పుడు నలుదిశలా వ్యాపించింది. ఈ సంస్థ కార్యాలయాలు చెన్నై, ఇండియా, కాలిఫోర్నియా, అమెరికాలో ఉన్నాయి. కంపెనీలో సుమారు 4000 మంది ఉద్యోగులు ఉన్నారు.
నాస్డాక్లో ఫ్రెషవర్క్ షేరు 36 డాలర్లతో లిస్ట్ అయింది. ఆ తరువాత ఈ స్టాక్ 25 శాతం లాభంతో 48 డాలర్లను చేరుకుంది. దీంతో సంస్థ మార్కెట్ క్యాప్ 13 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది ఉద్యోగులు అందుకున్న షేర్ల ధరలను కూడా పెంచింది. కంపెనీ ఐపిఒలో 2.85 కోట్ల షేర్లను విక్రయించగా, ఒక షేర్ ధర 36 డాలర్లుగా నిర్ణయించారు. లిస్టింగ్ ద్వారా ఉద్యోగుల సంపద పెరగడంపై కంపెనీ సీఈవో గిరీష్ మాతృబుతమ్ మాట్లాడుతూ ఫ్రెష్వర్క్స్లో 76 శాతం మంది ఉద్యోగులకు సంస్థ షేర్లు ఉన్నాయి. తానెంతో సంతోషిస్తున్నాని, గర్వంగా ఉందని అన్నారు.






