Elon Musk : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ … తొలి 10 మందిలో స్థానం కోల్పోయిన బిల్‌గేట్స్

అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ వినూత్న వ్యూహాలతో సంపదను పెంచుకున్నారు. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల సంఖ్య 2025లో 3028కి పెరగడం ఇందుకు నిదర్శనం. వీరి మొత్తం సంపద విలువ 16.1 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. 2025 జులైకు సంబంధించి ఫోర్బ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రపంచ అగ్రగామి కుబేరుడిగా కొనసాగుతున్నారు. అయితే ఈ ఏడాది జూన్‌తో పోలిస్తే ఆయన సంపద విలువ 16 బి. డాలర్లు తగ్గి 407 బి. డాలర్ల ( రూ.34.6 లక్షల కోట్ల)కు పరిమితమైంది. 2024 మేలో 400 బి.డాలర్ల మైలురాయిని అధిగమించిన తొలి కుబేరుడిగా నిలిచినప్పటి నుంచీ మస్క్ అగ్రస్థానంలో కొనసాగతున్నారు. ఒరాకిల్ సహ వ్యవస్థాపకులు లారీ ఎలిసన్ (Larry Ellison) నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎదిగారు. తన సంపద విలువ 7 రోజుల్లోనే దాదాపు 30 శాతం ( 52 బిలియన్ డాలర్లు) తగ్గి 124 బిలియన్ డాలర్లకు పరిమితం కావడం వల్ల అగ్రగామి 10 కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ (Bill Gates)కు స్థానం దక్కలేదు. తన సంపదలో అత్యధిక భాగాన్ని గేట్స్ ఫౌండేషన్ (Gates Foundation) ద్వారా రాబోయే రెండు దశాబ్దాల్లో దాతృత్వ కార్యక్రమాలకే వెచ్చిస్తానని బిల్‌గేట్స్ తెలిపారు.