White House: అమెరికా -చైనా మధ్య ముదురుతున్న వాణిజ్య యుద్ధం.. పోరాటానికి భయపడమన్న డ్రాగన్..!

చైనా (China) కు మరో షాకిచ్చారు ట్రంప్ (Donald Trump). అదనంగా 100 శాతం సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. అవి నవంబరు 1వ తేదీ నుంచి గానీ, అంతకు ముందు నుంచి గానీ అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇక ఇరాన్‌తో ఇంధన వ్యాపారం చేస్తున్న భారతీయ సంస్థలపై ఆంక్షలు విధించారు. ప్రపంచంలో ఎక్కడా దొరకని అరుదైన ఖనిజాలను ఎగుమతి చేయడంపై గురువారం చైనా నియంత్రణలు విధించింది. ఇక నుంచీ విదేశీ కంపెనీలు వాటిని దిగుమతి చేసుకోవాలంటే ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మైనింగ్ రంగంలో ఉపయోగించే టెక్నాలజీలను ఎగుమతి చేయడంపైనా ఆంక్షలు విధించింది. సైనిక సంబంధ అంశాల్లో ఈ అరుదైన ఖనిజాల వినియోగానికి ఎగుమతులను నిషేధించింది. ఇది ట్రంప్‌నకు కోపం తెప్పించింది. వెంటనే తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా స్పందించారు. చైనా ఎగుమతుల నియంత్రణ షాక్‌కు గురి చేసిందని పేర్కొన్నారు. ‘చైనా బద్ధ విరోధిగా తయారవుతోంది. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ చిప్‌లు, లేజర్లు, జెట్ ఇంజిన్లు, ఇతర టెక్నాలజీల్లో వినియోగించి మ్యాగ్నెట్లు, ఇతర ఖనిజాలను నియంత్రించడం ద్వారా ప్రపంచాన్ని గుప్పిట పట్టాలని చూస్తోంది’ అని ఆరోపించారు. త్వరలో దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో భేటీ కావడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు.
‘నవంబరు 1 నుంచి గానీ, అంతకు ముందు నుంచి గానీ.. చైనా నిర్ణయాలను బట్టి 100 శాతం అదనపు సుంకాలను అమలు చేస్తాం. ఇది ప్రస్తుతం వసూలు చేస్తున్న సుంకాలకు అదనం. దీంతోపాటు చైనాకు అమెరికా సంస్థలు ఎగుమతి చేసే కీలక సాఫ్ట్‌వేర్‌లపైనా నియంత్రణలు విధిస్తాం’ అని ట్రంప్ హెచ్చరించారు.చైనాపై సుంకాల ప్రకటన వెలువడగానే అమెరికా స్టాక్ మార్కెట్ సూచీ ఎస్‌అండ్‌పీ 500.. 2.7శాతం పడిపోయింది. ఇది ట్రంప్ తొలిసారిగా భారీగా సుంకాలను ప్రకటించిన ఏప్రిల్ నెలలో మార్కెట్లు ఎదుర్కొన్న దారుణ పరిస్థితులకు దగ్గరగా ఉంది.
భారత కంపెనీలపై..
ఇరాన్‌తో ఇంధన వ్యాపారం చేస్తున్న పలు సంస్థలపై 8 మంది వ్యక్తులపై అమెరికా ఆంక్షలు విధించింది. మొత్తంగా 40 సంస్థలు, వ్యక్తులు, నౌకలపై అమెరికా విదేశాంగశాఖ ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. అందులో భారతీయులు, కంపెనీలున్నాయి. ఇవి ఎల్పీజీ, సహజ వాయువులను దిగుమతి చేసుకుంటున్నాయి.