Crypto Market : ఒక ప్రకటనతో రూ.26 లక్షల కోట్లు… క్రిప్టోమార్కెట్‌లో ట్రంప్ జోష్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ఒక్క ప్రకటన క్రిప్టో మార్కెట్లోకి 300 బిలియన్ డాలర్ల ( (సుమారు రూ.26 లక్షల కోట్లు)ను చొప్పించింది. ఆయన ఐదు క్రిప్టో కరెన్సీ (Cryptocurrencies )లను అమెరికా వ్యూహాత్మక రిజర్వులుగా ఉంచాలనుకొంటున్నట్లు సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ప్రెసిడెన్సియల్ వర్కింగ్ గ్రూప్ క్రిప్టో వ్యూహాత్మక రిజర్వులు ఏర్పాటు చేసేలా పని చేయాలని మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ రిజర్వుల్లో ఎక్స్‌ఆర్‌పీ, ఎస్‌వోఎల్( సోలాన), ఏడీఏ (కార్డనో) కరెన్సీలను చేర్చాలన్నారు. ఆ తర్వాత గంటన్నరకు బిట్‌కాయిన్ (Bitcoin,), ఎథర్ (Ether )ను కూడా చేర్చాలని పోస్టు పెట్టారు. గతంలో ట్రంప్ క్రిప్టోలపై ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ జారీ చేసిన సమయంలో కాయిన్ల పేర్లను ప్రస్తావించలేదు.
తాజాగా అమెరికా అధ్యక్షుడి ప్రకటన వెలువడిన వెంటనే ఐదు క్రిప్టో కరెన్సీల విలువ దూసుకెళ్లింది. ఇక వీటిని అమెరికా ఎలా నిల్వలు చేస్తుందనే అంశంపై మాత్రం వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఎక్స్‌ఆర్‌పీ, ఎస్‌వోఎల్, ఏడీఏ విలువ 62 శాతం పెరగ్గా, బిట్‌కాయిన్, ఎథర్ విలువ 10 శాతానికి పైగా ఎగసింది. వాస్తవానికి బిట్‌కాయిన్ ఫిబ్రవరి నెలలో కొంత విలువ కోల్పోయింది. ఇప్పుడు మళ్లీ వేగంగా పుంజుకొంది.