McDonalds: 40 ఏళ్ల సేవకు అభినందన: మెక్‌డొనాల్డ్స్‌లో భారత సంతతి వ్యక్తికి సన్మానం!
అమెరికాలోని మెక్‌డొనాల్డ్స్ (McDonalds) ఔట్లెట్లో 40 ఏళ్లపాటు నిస్వార్థంగా సేవలందించిన భారత సంతతి వ్యక్తి బల్బీర్ సింగ్‌కు అరుదైన సన్మానం లభించింది. ఈ 40 ఏళ్ల మైలురాయిని అందుకున్న ఆయనకు సహోద్యోగులు, ఫ్రాంచైజీ నాయకులు ఒక వేడుకలా నిర్వహించారు. 1980లలో అమెరికాకు వచ్చిన బల్బీర్ సింగ్.. సాగస్లోని మెక్‌డొనాల్డ్స్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు.
40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లిమోసిన్‌లో ఆయన రెస్టారెంట్‌కు చేరుకున్నారు. సహొద్యోగులు ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సింగ్‌కు సర్వీస్ అవార్డుతో పాటు, “One in Eight” అనే గుర్తుంచుకోదగిన జాకెట్‌ను, ఆయన 40 ఏళ్ల సేవకు గుర్తుగా $40,000 చెక్కును (సుమారు ₹33 లక్షలు) బహూకరించారు.
ఫ్రాంచైజీ యజమాని లిండ్సే వాలిన్.. సింగ్ అంకితభావాన్ని ప్రశంసించారు. “మా సంస్థ హృదయం, ఆత్మను తీర్చిదిద్దడంలో 40 ఏళ్లు సహాయపడిన వ్యక్తి” అని మెచ్చుకున్నారు. వాలిన్ తండ్రి, అసలు ఫ్రాంచైజ్ యజమాని బాబ్ కింగ్‌తో కూడా సింగ్ చాలా కాలం పనిచేశారని తెలిపారు. సహోద్యోగులు సింగ్‌ను ఆప్యాయంగా “పాపా బేర్” అని పిలుస్తారు. “ఇది ఒక రకంగా కుటుంబం లాంటిది, అందుకే నేను ఇక్కడ ఇంతకాలం ఉన్నాను” అని బల్బీర్ సింగ్ అన్నారు. ఆయనను సాయంత్రం కూడా లిమోసిన్‌లో విందుకు తీసుకెళ్లి ఘనంగా సన్మానించారు.






