Bejing: భారత్ సరిహద్దుల్లో చైనా మరో భారీ ప్రాజెక్టు.. ఎల్ఏసీ సమీపంలో రైల్వేలైన్..!
సరిహద్దు వెంట మౌలిక సదుపాయాల కల్పనను శరవేగంగా చేపడుతున్న చైనా (China).. తాజాగా మరో కీలక ప్రాజెక్టుకు సన్నద్ధమవుతోంది. భారత సరిహద్దు సమీపంలో భారీ రైల్వేలైన్ పనులు చేపట్టనున్నట్లు సమాచారం. టిబెట్‌ను షిన్‌జాంగ్ ప్రావిన్స్‌తో కలుపుతూ నిర్మించనున్న ఈ రైల్వే మార్గంలోని కొన్ని భాగాలు వాస్తవాధీన రేఖ (LAC) సమీపం నుంచి వెళ్లనున్నాయి. దీంతో భారత్ సరిహద్దు ప్రాంతంలో ఈ ప్రాజెక్టుకు రక్షణపరమైన ప్రాముఖ్యం ఏర్పడనుంది.
షిన్‌జాంగ్‌లోని హోటాన్, టిబెట్‌లోని లాసాలను కలుపుతూ చేపట్టనున్న రైల్వే లింక్ నిర్మాణ పనులు ఈ ఏడాది ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తెలిపింది. దీనికోసం 95 బిలియన్ యువాన్ల (రూ.1.15 లక్షల కోట్లు) మూలధనంతో ‘ది షిన్‌జాంగ్-టిబెట్ రైల్వే కంపెనీ’ని అధికారికంగా రిజిస్టర్ చేసినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘షాంఘై సెక్యూరిటీస్ న్యూస్’ను ఉటంకిస్తూ వెల్లడించింది. ఈ రైల్వే మార్గంలోని కొన్ని భాగాలు చైనా-భారత్ సరిహద్దులోని ఎల్‌ఏసీ సమీపం నుంచి వెళ్లనున్నాయని.. తద్వారా అంతగా అభివృద్ధి చెందని ఆ సరిహద్దు ప్రాంతంలో రక్షణపరమైన ప్రాముఖ్యాన్ని అందిస్తాయని పేర్కొంది.
తూర్పు లద్దాఖ్‌లో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణల కారణంగా దెబ్బతిన్న సంబంధాలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఇరుదేశాలు చర్యలు తీసుకుంటున్న వేళ.. ఈ రైల్వే లింక్ విషయంలో బీజింగ్ ముందడుగు వేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. టిబెట్‌లోని యార్లంగ్ జాంగ్బో (బ్రహ్మపుత్ర) నదిపై చైనా ఇటీవల భారీ జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిపై భారత్, బంగ్లాదేశ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ.. డ్రాగన్ మాత్రం మొండిగా ముందుకు పోతున్నట్లు కనిపిస్తోంది.







